సాక్షి, అమరావతి/నెట్వర్క్: మురసు తుపాను బలహీనపడినా దాని ప్రభావంతో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వానలు పడుతున్నాయి. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మాత్రం దఫదఫాలుగా వర్షాలు కురిశాయి. ఈ జిల్లాల్లో పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా ఊళ్లన్నీ జలమయం కాగా.. జనజీవనం స్తంభించింది. వరి చేలల్లో మరోసారి నీరు చేరడంతో పంట కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రొయ్యలు, చేపల చెరువులకు తీవ్రనష్టం ఏర్పడింది.
కోనసీమ.. వానసీమ
కుండపోత వానలు కురవడంతో కోనసీమ జిల్లా వానసీమలా మారింది. గత నెల 27న అర్నబ్ తుపానుకు వరి పంట నేలకొరిగింది. పొలాల్లో నీరు నిలిచిపోవడంతో కోతలు చేపట్టలేని దుస్థితి ఏర్పడింది. బుధవారం కురిసిన కుండపోత వర్షానికి ఇప్పటికే నేలకొరిగిన చేలు మరింతగా నీట మునిగాయి. మొత్తం మీద వరుస తుపాన్లు, భారీ వర్షాలకు కోనసీమ జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.
జనజీవనం అస్తవ్యస్తం
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని అన్ని ప్రాంతాలూ పూర్తిగా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోయింది. నిడదవోలు బస్టాండ్ జలమయమైంది. అక్కడి రైల్వే ట్రాక్‌పైకి వర్షం నీరు చేరింది. నిడదవోలు కోటసత్తెమ్మ ఆలయంలోకి వర్షం నీరు చేరడంతో భక్తుల దర్శనాలు నిలిపేశారు. గోపాలపురం జంక్షన్ వద్ద హైవే పైనుంచి వరద నీరు ప్రవహించింది. కడియం మండలంలోని నర్సరీలకు కూడా వర్షాల కారణంగా నష్టం వాటిల్లింది. వరదనీరు చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఏలూరు జిల్లా అతలాకుతలం
మురసు తుపాను ధాటికి ఏలూరు జిల్లా అతలాకుతలమైంది. ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రహదారులన్నీ జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొయ్యలగూడెం మండలంలో ఊరచెరువుకు గండిపడటంతో అచ్యుతాపురం గ్రామం జల దిగ్భంధంలో చిక్కుకుంది. కొయ్యలగూడెం బ్రాహ్మణ కాలనీ వద్ద పల్లి గణపతికి చెందిన 5 గేదెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అందులో రెండు గేదెలు మృత్యువాతపడ్డాయి.

గుంటూరు జిల్లా పెదనందిపాడులో చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు
కొయ్యలగూడెంలో అచ్యుతాపురం నుంచి నరసన్నపాలెం వరకు జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. వేలేరుపాడు మండలం పెద్దవాగు రింగ్‌బండ్ తెగిపోవడంతో 8 గ్రామాలు నీటమునిగాయి. వేలేరుపాడు–అశ్వారావుపేట మధ్య రహదారి జలదిగ్భందంలో చిక్కుకుపోగా రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కనూరు మండలంలో గుండేటి వాగు, పాలవాగు, పాములేరువాగు, రాళ్లవాగు, కిన్నెరసానివాగు ఉధృతంగా ప్రవహించడంతో కుక్కునూరు–దాచారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
బుట్టాయగూడెం మండలంలో జల్లేరు వాగు సహా ప్రధాన వాగులు ఉధృతంగా మారడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. భీమడోలు అధిక వర్షం కారణంగా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలోకి నీరు చేరింది. అందులోని 50 మంది విద్యార్థులను సమీపంలోని కళాశాల వసతి గృహంలోకి తరలించారు.
పశ్చిమ గోదావరిలో కుండపోత
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం జిల్లావ్యాప్తంగా 315 సెం.మీ వర్షం కురిసింది. నరసాపురం, తాడేపల్లిగూడెం, మొగల్తూరు, పెనుమంట్ర, పాలకోడేరు, యలమంచిలి మండలాల్లో 20 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదైంది. ఆచంట నియోజకవర్గంలోని నక్కల డ్రెయిన్, భీమవరంలో యనమదుర్రు, ఆకివీడులోని ఉప్పుటేరు, తణుకులో ఎర్రకాలువ తదితర డ్రెయిన్లు పొంగ్రి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని 71 వేల హెక్టార్లలోని వరి పంట నేలకొరిగింది.
ఇదీ చదవండి: బాబు పాలనలో అన్నదాతకు పుట్టెడు శోకం
అధికశాతం విస్తీర్ణంలో పాలుపోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉంది. ఇప్పటికే హెక్టారుకు 65 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. భారీ వర్షాలతో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు. భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ల నుంచి ఎన్నికల సామగ్రిని తీసుకుని వెళ్లేందుకు వారికి తిప్పలు తప్పలేదు. లోతట్టు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల చుట్టూ వర్షపు నీరు చేరడంతో పలుచోట్ల ప్రత్యామ్నాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
వరద నీటిలో చిక్కుకున్న ఎన్నికల సిబ్బంది
తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో వరద నీటి ప్రవాహంలో ఎన్నికల సిబ్బంది చిక్కుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భారీగా వరద ప్రవాహం రావడంతో ఎన్నికల అధికారులు, సిబ్బంది వరద నీటిలో చిక్కుకుపోయారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, పోలీసులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి వరద ప్రవాహంలో చిక్కుకున్న ఎన్నికల అధికారులు, సిబ్బందిని బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎన్నికల సిబ్బందికి తప్పిన ప్రమాదం
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం సొలబం ఘాట్‌లో ఎన్నికల సిబ్బందికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులతో సుమారు 30 మంది సిబ్బంది జి.మాడుగుల రిసెప్షన్ కేంద్రం నుంచి సొలబం మార్గంలోని పోలింగ్ కేంద్రాలకు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. ఘాట్‌లోని ఓ ప్రమాదకర మలుపు వద్ద బస్సు కొండ ఎక్కలేక ఆకస్మికంగా నిలిచిపోయింది. వెనక్కి జారిపోకుండా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో బస్సులోని ఎన్నికల సిబ్బంది ప్రాణభయంతో కిందకు దిగి పరుగులు తీశారు. కండిషన్లో లేని పాత బస్సు కావడంతోనే ఘాట్ ఎక్కలేకపోయిందని డ్రైవర్ గుర్తించారు. దీంతో సిబ్బంది సుమారు కిలోమీటరు మేర ఘాట్‌లోని మూడు మలుపులను కాలినడకన దాటాల్సి వచ్చింది. అనంతరం ఖాళీగా ఉన్న బస్సు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఘాట్ ఎక్కింది. ఆ తర్వాత సిబ్బంది తిరిగి బస్సులో ప్రయాణించి తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
ముంపునీటిలో బ్యాలెట్ బాక్స్‌లు
కాకినాడ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి కరప మండల పరిషత్ కార్యాలయంలోకి నీరు చేరింది. గురువారం జరిగే జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లను ఈ కార్యాలయంలోని ఓ గదిలో భద్రపరిచారు. ఆ గదిలోకి వర్షం నీరు చేరడంతో అధికారులు హైరానా పడ్డారు. ఖాళీ బాక్స్‌లు కావడంతో ఊపిరిపీల్చుకుని పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్ బాక్సులను, వేరే గదిలో ఉన్న బ్యాలెట్ పత్రాలను కరప హైస్కూల్‌కు తరలించారు.
మరో రెండు రోజులు వానలే
మురసు తుపాను ప్రభావంతో మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం 20 జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, నీట మునిగిన కాజ్‌వేలను దాటే ప్రయత్నం చేయొద్దని సూచించింది.
బయ్యన్నగూడెంలో అత్యధిక వర్షపాతం
బుధవారం ఏలూరు జిల్లా బయ్యనగూడెంలో అత్యధికంగా 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జీలుగుమిల్లిలో 13.9, పి.నారాయణపురంలో 12.8, నూతిరామన్నపాలెంలో 12.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడ జిల్లా ఆర్యవటంలో 12.6, పెదపూడిలో 1.23, కాజులూరులో 12, కరపలో 12, వేళంగిలో 11, జి.మామిడాడలో 11.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
మంగళగిరి లక్ష్మీనరసింహ క్షేత్రంలో కూలిన ప్రహరీ
చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యానికి ప్రతీకగా నిలిచిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మురసు తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల ప్రభావంతో సుమారు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయ ప్రాంగణంలోని పురాతన ప్రహరీ కొంతభాగం బుధవారం తెల్లవారుజామున కుప్పకూలింది.

నల్లమడ వాగుకు గండి
గుంటూరు జిల్లా పెదనందిపాడు వద్ద నల్లమడ వాగుకు గండి పడటంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 1500 ఎకరాల్లోని పంట నీటమునిగింది.
ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వద్ద కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజీకి 40 గేట్లను అడుగుమేర ఎత్తి 71 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేశారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో వరద ప్రవాహం తగ్గింది. 36,250 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రాత్రి 9 గంటల ప్రాంతానికి వరద తగ్గు ముఖం పట్టడంతో బ్యారేజ్ 35 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 25,375 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.