టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashavi Jaiswal)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఫీల్డింగ్‌తో జట్టు ఓటమికి కారణమైందే గాకుండా.. డాన్సులు వేస్తావా? అంటూ మండిపడుతున్నారు. కాగా ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ (India vs England)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా ఐదు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు మరీ చెత్తగా ఫీల్డింగ్ చేశారు.
నాలుగు క్యాచ్‌లను జారవిడిచిన జైసూ
మొత్తంగా ఐదు రోజుల ఆటలో దాదాపు ఎనిమిది క్యాచ్‌లు డ్రాప్ చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించారు. ఇందులో నాలుగు క్యాచ్‌లను యశస్వి జైస్వాల్ జారవిడిచాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కీలక సమయాల్లో బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేసిన జైసూ.. ఆఖరి రోజు ఆటలోనూ బెన్ డకెట్ (149) క్యాచ్ విడిచిపెట్టేశాడు.
మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో డకెట్.. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నపుడు క్యాచ్ ఇవ్వగా.. జైసూ దానిని జారవిడిచాడు. ఆ ర్వాత డకెట్ భారీ సెంచరీ చేసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పటికే జైస్వాల్‌పై అభిమానులు, భారత మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డాన్స్ చేసిన జైసూ.. అభిమానులు ఫైర్
ఇంగ్లండ్ విజయానికి చేరువవుతున్న వేళ.. యశస్వి జైస్వాల్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చిన్నగా స్టెప్పులేస్తూ కనిపించాడు. ఇంగ్లండ్ అభిమానుల ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తుండగా.. వారి ముందు జైసూ నవ్వుతూ కాలుకదిపాడు. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘‘నీకసలు బుద్ధి ఉందా?.. ఏకంగా నాలుగు క్యాచ్‌లు మిస్ చేశావు. ప్రత్యర్థి జట్టు గెలుపునకు పరోక్షంగా కారణమయ్యావు. అయినా.. ఏమాత్రం బాధ లేకుండా డాన్స్ చేస్తున్నావా?.. ఇప్పుడు గనుక కెప్టెన్‌గా రోహిత్ శర్మ మైదానంలో ఉంటే.. చెంప మీద ఒక్కటి ఇచ్చేవాడు’’ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
మరికొందరేమో.. ‘‘విరాట్ కోహ్లిని కాపీ కొట్టాలని చూస్తున్నావేమో.. నువ్వెప్పటికీ కింగ్‌వి కాలేవు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే, జైసూ అభిమానులు మాత్రం అతడికి అండగా నిలుస్తున్నారు. బ్యాటర్‌గా తన వంతు పూర్తి చేసిన ఈ యువ ఆటగాడి పట్ల అంత ద్వేషం పనికిరాదని.. ఇంగ్లండ్ గడ్డ మీద తన తొలి మ్యాచ్‌ను అతడు ఆస్వాదించడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.
గిల్‌కు చేదు అనుభవం
కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ శతక్కొట్టాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ విఫలమయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులే చేశాడు. ఇక ఈ మ్యాచ్‌తో భారత టెస్టు జట్టు సారథిగా ప్రస్థానం ఆరంభించిన శుబ్‌మన్ గిల్‌కు.. ఓటమి రూపంలో తొలి ప్రయత్నంలోనే భంగపాటు ఎదురైంది.
చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్
Bro Jaiswal dancing happily after dropping 7 catches in a single match.
Helped England to win single-handedly.
Goal achieved.#INDvsENG pic.twitter.com/EqjsxuJ5vO— Villager Anuj Tomar (@Da___Engineer) June 24, 2025