సాక్షి, న్యూఢిల్లీ: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. వివాహం చేసుకుని స్వతంత్రంగా జీవిస్తున్న ఆమె మాట్లాడిన మాటలకు, మంత్రిగా ఉన్న తనకు పార్టీ షోకాజ్ నోటీసు ఇవ్వడం పెద్ద తప్పని పేర్కొన్నారు. తన కుమార్తె మాట్లాడిన మాటలకు తననెలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనకుండి మాట్లాడించిన శక్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
‘మంగళవారమే ఢిల్లీకి చేరుకున్నప్పటికీ సమయం దొరకలేదు. బుధవారం మధ్యాహ్నం పార్టీ అధ్యక్షుడిని కలిసి అన్ని అంశాలను సమగ్రంగా వివరించా. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బిజీగా ఉండటంతో ఆయన్ను కలవలేకపోయా. నా వివరణను ఖర్గే, మీనాక్షి నటరాజన్‌లకు లిఖితపూర్వకంగా అందజేశా. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీలకు ఈ–మెయిల్ ద్వారా, కేసీ వేణుగోపాల్‌కు వాట్సాప్ ద్వారా పంపించా. నా వివరణను పరిశీలిస్తానని ఖర్గే చెప్పారు..’అని సురేఖ వెల్లడించారు.
నా కూతురు పూర్తి స్వతంత్ర వ్యక్తిగా జీవిస్తోంది..
‘నా కూతురికి పెళ్లయింది. తను ఒక ఇంటి కోడలిగా పూర్తి స్వతంత్ర వ్యక్తిగా జీవిస్తోంది. తన ఆలోచనలు, అభిప్రాయాలను వ్యక్తం చేసే, మాట్లాడే అధికారం ఆమెకు ఉంది. మాట్లాడవద్దని చెప్పే అధికారం తల్లిదండ్రులుగా మాకు లేదు. సమాజంలో నిత్యం వందల మంది ఎన్నో మాట్లాడుతుంటారు. అలాగే ఆమె కూడా మాట్లాడింది. ఆమె నా బిడ్డ అయినంత మాత్రాన నన్ను ఎందుకు బాధ్యురాలిని చేయాలి? మహిళలు మనుస్మృతి భావజాలాన్ని వీడి తండ్రి లేదా సోదరుల మద్దతుపై ఆధారపడకుండా స్వతంత్రంగా మాట్లాడాలని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. నా బిడ్డ అలాగే స్వతంత్రంగా మాట్లాడింది. ఆ వ్యాఖ్యలను సమరి్ధంచడం లేదా ఖండించడంపై నేనేమీ మాట్లాడను. నా సొంత రాజకీయ జీవితం, నా భర్త రాజకీయ ప్రస్థానం వేరు.
మంత్రి పదవి కొనసాగించాలని కోరా..
నేను పద్మశాలి వర్గానికి, నా భర్త మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాళ్లం. తెలంగాణలో ఈ రెండు సామాజిక వర్గాలకు కలిపి దాదాపు 16 శాతం ఓటు బ్యాంకు ఉంది. బీసీ మంత్రిగా ఉన్న నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అప్పగించిన శాఖలను నిరి్వఘ్నంగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నా. నా మంత్రి పదవికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనసాగేలా చూడాలని అధిష్టానాన్ని కోరా. నాపై మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ స్వచ్ఛందంగా మాట్లాడలేదు. కొందరు వెనకుండి బలవంతంగా మాట్లాడించారు. వివాదం అవుతుందనే ఉద్దేశంతో వారి పేర్లు బయటపెట్టడం లేదు. ఎవరు మాట్లాడించారో అధిష్టానానికి తెలుసు.
మాట్లాడినవారే స్వయంగా మాకు ఫోన్లు చేసి..వాళ్లు పిలిస్తే అయిష్టంగానే వెళ్లాల్సి వచి్చందని చెప్పారు. తప్పు చేయని నన్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలి. వారి వెనుక ఉండి నడిపించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది..’అని సురేఖ అన్నారు. పీసీసీ క్రమశిక్షణ సంఘం తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా నివేదిక ఇచ్చి ఉండవచ్చని, ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్న తనపై నిర్ణయం తీసుకునే తుది అధికారం కేవలం అధిష్టానానికే ఉంటుందని చెప్పారు. ఏఐసీసీ తీసుకునే నిర్ణయం ఆధారంగా తన తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.