ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3% డీఏ, డీఆర్ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1.16 కోట్ల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు 2026 జులై 1 నుంచి ఈ పెంపు వర్తించనుంది.
దీంతో ఇప్పటివరకు 60 శాతంగా ఉన్న డీఏ 63 శాతానికి చేరింది. ప్రతి 6 నెలలకు ఒకసారి చేసే సవరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీపావళి వేడుకలకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026 జులై విడత డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు దేశవ్యాప్తంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ (ఏఐసీపీఐ–ఐడబ్ల్యూ) 12 నెలల సగటు ఆధారంగా డీఏ సవరణలు చేపడతారు.
ఈ సూచీ ఆధారంగా డీఏ పెంపును లెక్కిస్తారు. 2026 జులై విడత సవరణకు అవసరమైన 12 నెలల సూచీ గణాంకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటి ఆధారంగా తదుపరి 6 నెలల డీఏ లేదా డీఆర్‌ను 3 శాతం పెంచుతారని అంచనా వేశారు. దీంతో డీఏ 60 శాతం నుంచి 63 శాతానికి పెరిగింది.
ఈ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ ఆదాయం పెరుగుతుంది. ఉదాహరణకు, రూ.18,000 మూల వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు అదనంగా రూ.540 లభిస్తుంది. రూ.29,200 మూల వేతనం ఉన్న ఉద్యోగికి నెలకు రూ.876 అదనంగా అందుతుంది.
కేంద్ర క్యాబినెట్ ఇతర నిర్ణయాలు
-
కంటైనర్ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లతో ప్రత్యేక పథకం.
-
క్రీడా వస్తువుల తయారీ రంగ అభివృద్ధికి ‘ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్’కు రూ.1,856 కోట్లు కేటాయింపు.
-
డీఏ (కరవు భత్యం), డీఆర్ (కరవు సహాయ భత్యం) కోసం రూ.10,016 కోట్ల కేటాయింపు.
-
కేంద్ర కేబినెట్ ప్రకటించిన నాలుగు నిర్ణయాలకు కలిపి మొత్తం రూ.29,267 కోట్ల కేటాయింపు.
-
ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజనకు రూ.7,395 కోట్ల కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇదీ చదవండి: గ్లోబల్ మార్కెట్లన్నీ తుక్కు తుక్కు అయిపోతాయ్: ఇరాన్ వార్నింగ్












