కాఠ్మాండు: నేపాల్‌లోని పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ వైపు వెళ్లే మార్గంలోని సోలుఖుంబు ప్రాంతంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ల్యాండింగ్ అవుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటనతో కలకలం చెలరేగింది.
సోలుఖుంబు హెలిప్యాడ్ వద్ద ప్రమాదం
నేపాల్‌లోని సోలుఖుంబు హెలిప్యాడ్ వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఫిష్‌టెయిల్ ఎయిర్, డైనాస్టీ ఎయిర్ సంస్థలకు చెందిన రెండు హెలికాప్టర్లు ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్ పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం.. మంగళవారం ఉదయం సుమారు 8.11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు హెలిప్యాడ్ వద్ద దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
TWO HELICOPTERS COLLIDE NEAR EVEREST BASE CAMP; ONE FOREIGNER KILLED Scary footage this morning. Two helicopters operated by Fishtail Air and Air Dynasty collided while attempting to land at Pheriche in Nepal’s Everest region One foreign passenger was killed and another person injured. The crash occurred around 8:15 AM (local time) The cause is under investigation.
— Subodh Kumar (@kumarsubodh_) November 3, 2026
ఈ ఘటనలో తమిళనాడులోని చెన్నైకి చెందిన 47 ఏళ్ల పర్యాటకుడు వాసంత్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఫిష్‌టెయిల్ ఎయిర్ హెలికాప్టర్‌లోనే ప్రయాణిస్తున్న మరో వ్యక్తి షైలేష్ కృష్ణ పటేల్ (49) కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయపడిన ఆయనను హెలికాప్టర్‌లో ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లకు చెందిన పైలట్లు రవీంద్ర ప్రజాపతి, ప్రజ్వల్ కేసీ కూడా గాయపడ్డారు.











