డెస్క్ ఉద్యోగాల్లో ఒత్తిడిని తగ్గించి, శరీరానికి మంచి ప్రయోజనాలను అందించడంలో అధిక ప్రయోజనాలను ఇచ్చే యోగాసనాల్లో బద్ధకోణాసనం ఒకటి. ఈ యోగా భంగిమలో సీతాకోక చిలుక రెక్కల్లా మోకాళ్లు కదలికలు ఉంటాయి కాబట్టి దీనిని ఈ పేరుతో పిలుస్తారు. కాళ్లు, తుంటి, వెన్ను భాగాలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
ఉదయం లేదా సాయంత్రం రోజూ కొన్ని నిమిషాలు ఈ బటర్‌ఫ్లై ఆసనాన్ని సాధన చేస్తే మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. కంప్యూటర్లలో పని చేసే వారు, వెన్ను నొప్పి, మెడ, తుంటి నొప్పితో ఇబ్బంది పడేవారికి ఇది ఎంతో ఉపయోగకరం.
చేసే విధానం (20 నుంచి 30 సార్లు)
-
నేలపై యోగా మ్యాట్‌పై కూర్చోవాలి.
-
రెండు పాదాలను ఒకదానికొకటి తాకించి, చేతులతో పాదాలను పట్టుకోవాలి.
-
వెన్నెముకను నిటారుగా ఉంచాలి.
-
శ్వాసను గమనిస్తూ మోకాళ్లను సీతాకోకచిలుక రెక్కల్లా మెల్లగా పైకి–కిందికి మెల్లగా కదిలించాలి ∙సాధారణ శ్వాసతో 20 నుంచి 30 సార్లు చేయాలి.
ప్రయోజనాలు...
-
పెల్విక్ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
-
వెన్ను నొప్పి, నడుము బిగుతు తగ్గించడంలో సహాయపడుతుంది.
-
ఎక్కువసేపు కూర్చునే వారికి ఉపశమనం కలిగిస్తుంది.
-
మహిళల్లో పెల్విక్ ఆరోగ్యానికి, గర్భధారణ సమయంలో (నిపుణుల పర్యవేక్షణలో) ఉపయోగకరంగా ఉంటుంది.
-
శరీర ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
-
లోయర్ బ్యాక్ కండరాలకు బలం చేకూరుతుంది.
-
ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
-
వెన్ను, మెడ, తుంటి నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది.
జాగ్రత్తలు...
-
మోకాలి లేదా హిప్‌కు తీవ్రమైన గాయం ఉంటే చేయకూడదు. ∙మోకాళ్లను బలవంతంగా నేలకు నొక్కకూడదు. ∙వెన్ను వంచకుండా నిటారుగా ఉంచాలి.
-
నొప్పి అనిపిస్తే వెంటనే ఆపాలి.
-
గర్భిణులు తప్పనిసరిగా శిక్షణ పొందిన యోగా గురువు పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
-అనిత పాతర్ల, యోగా ట్రైనర్