నేడు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. బడిలో పాఠాలు చెప్పే గురువులకు మాత్రమే కాదు.. మన చుట్టూ ఉండే సాధారణ వ్యాపారులు కూడా అమూల్యమైన ఫైనాన్స్ పాఠాలు నేర్పిస్తుంటారు. వారి వ్యాపార నైపుణ్యాలను గమనిస్తే మధ్యతరగతి ప్రజలు కూడా సంపద సృష్టించే మార్గాలు తెలుసుకోవచ్చు.
బడ్డీకొట్టు వ్యాపారి: నగదు ప్రవాహం పాఠం
వీధి మలుపులో ఉండే చిన్న కిరాణా కొట్టువాడిని గమనించండి. అతడు ఎప్పుడూ నష్టంలో కనిపించడు. కారణం.. తాను తక్కువ మార్జిన్‌తోనైనా ప్రతిరోజూ క్యాష్‌ఫ్లో ఉండేలా చూసుకుంటాడు. అప్పు ఇచ్చినా పరిమితి మించడు. ఈ క్యాష్‌ఫ్లో సూత్రాన్ని పర్సనల్ ఫైనాన్స్‌కు అన్వయిస్తే.. ఆదాయం కంటే తక్కువ ఖర్చు చేయడం, మిగిలిన దాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడిగా మార్చడం ముఖ్యం. నెలవారీ సిప్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇందుకు మంచి ఉదాహరణ.
టిఫిన్ సెంటర్: చిన్న మొత్తాల పవర్
టిఫిన్ సెంటర్ యజమాని ఒక్కో ఇడ్లీపై తక్కవ మొత్తంలోనే డబ్బు సంపాదిస్తాడు. కానీ రోజుకు వందల మంది కస్టమర్లు రావడంతో నెలాఖరుకు పెద్ద మొత్తం చేతికొస్తుంది. దీన్నే కాంపౌండింగ్ సూత్రంగా చెప్పుకోవచ్చు. చిన్న మొత్తాలు క్రమం తప్పకుండా, దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెడితే భారీ సంపదగా మారతాయి. యువత చిన్న వయసులోనే రిటైర్మెంట్ ఫండ్స్, పీపీఎఫ్ వంటి వాటిలో పెట్టుబడి ప్రారంభిస్తే వడ్డీపై వడ్డీ ప్రయోజనం భారీగా ఉంటుంది.
బట్టల షాపు: డిస్కౌంట్, నిల్వల నిర్వహణ
బట్టల వ్యాపారులు సీజన్ ముగిసేలోపు స్టాక్‌ను క్లియర్ చేసేందుకు డిస్కౌంట్లు ఇస్తారు. నిల్వ ఉంచడం వల్ల నష్టమని వారికి తెలుసు. ఇదే సూత్రం మన ఆస్తులకూ వర్తిస్తుంది. నిరుపయోగమైన, నష్టాన్నిచ్చే పెట్టుబడులను సకాలంలో వదిలించుకోవాలి. అలాగే, అనవసర కొనుగోళ్లకు దూరంగా ఉండి అవసరమైనప్పుడు మంచి ధరకు వస్తువులు కొనడం నేర్చుకోవాలి.
రెస్టారెంట్లు: విభిన్న ఆదాయ మార్గాలు
పెద్ద రెస్టారెంట్లు కేవలం ఆహారంపైనే ఆధారపడవు. హోమ్ డెలివరీ, క్యాటరింగ్, పార్టీ ఆర్డర్లు వంటి బహుళ ఆదాయ మార్గాలు సృష్టించుకుంటాయి. మధ్యతరగతి ఉద్యోగులు కూడా ఒకే జీతంపై ఆధారపడకుండా నైపుణ్యాల ఆధారంగా అదనపు ఆదాయ మార్గాలు (ఫ్రీలాన్సింగ్, పార్ట్‌టైమ్ పని, డివిడెండ్ ఆదాయం) ఏర్పరచుకోవడం ఆర్థిక భద్రతకు దోహదపడుతుంది.
వ్యాపారులు అనుసరించే క్రమశిక్షణ, రిస్క్ నిర్వహణ, దీర్ఘకాలిక ఆలోచన వంటి సూత్రాలను వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో అనుసరిస్తే సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా స్థిరమైన సంపదను నిర్మించుకోగలుగుతాయి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జీవితమే ఒక పాఠశాల అని, ప్రతి అనుభవం ఒక పాఠమని గుర్తుంచుకోవాలి.
ఇదీ చదవండి: మీ వీధిలోనే ఉన్నారు ఫైనాన్స్ గురువులు