అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఒక్కరోజే పసిడి ధర 1 శాతానికి పైగా ఎగబాకింది. దీంతో ఔన్సు ధర 4,107.01 డాలర్లకు చేరుకుంది. అటు అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ధర కూడా 1 శాతం పెరిగి 4,114.50 డాలర్ల వద్ద ముగిసింది.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం డాలర్ బలహీనపడటమే. నిజానికి డాలర్ విలువ తగ్గితే.. ఇతర దేశాల వారికి బంగారం కొనుగోలు చేయడం కొంత చౌకగా మారుతుంది. దీంతో పసిడికి డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు ముడి చమురు ధరలు కూడా భారీగా తగ్గాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు కొంత తగ్గాయి. చమురు ధరలు తగ్గితే.. రవాణా, ఉత్పత్తి ఖర్చులపై ఒత్తిడి తగ్గుతుంది. దీనివల్ల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ అంచనాలు కూడా.. బంగారం ధరల పెరుగుదలకు కారమయ్యాయి.
అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు
ఇక అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా.. గోల్డ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై మళ్లీ దాడులు జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడంతో చమురు ధరలు తగ్గాయి. అయితే.. హార్ముజ్ జలసంధి సమీపంలో నౌకలపై దాడులు జరగడంతో చమురు సరఫరాపై ఆందోళనలు మాత్రం కొనసాగుతున్నాయి.
సాధారణంగా యుద్ధాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. అయితే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారంపై పెట్టుబడుల ఆకర్షణ తగ్గుతుంది. ఎందుకంటే బంగారం ఎలాంటి వడ్డీ ఆదాయాన్ని ఇవ్వదు.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు
మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై కూడా మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గత వారం అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత ఇరాన్ యుద్ధం ముగిసే అవకాశాలపై ఆశలు పెరగడంతో బంగారం ధరలు సుమారు 5 శాతం పెరిగాయి. అయితే శుక్రవారం విడుదలైన అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా ఉండటంతో ఫెడ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం డిసెంబర్లో వడ్డీ రేట్ల పెంపునకు 82.2 శాతం అవకాశం ఉందని సీఎమ్ఈ ఫెడ్‌వాచ్ గణాంకాలు సూచిస్తున్నాయి.
చైనా భారీ కొనుగోలు
ఇదిలా ఉంటే.. చైనా కేంద్ర బ్యాంకు భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది. అక్టోబర్ నెలలో ఏకంగా 25.8 టన్నుల బంగారాన్ని తన నిల్వలకు యాడ్ చేసింది. చైనా గత మూడేళ్లలో.. కేవలం ఒక్క నెలలోనే భారీ మొత్తంలో కొనుగోలు ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఇక వెండి ధర కూడా 1.8 శాతం పెరిగి ఔన్సుకు 52.78 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం 1.8 శాతం, పల్లాడియం 0.3 శాతం పెరిగాయి.
ఇదీ చదవండి: ఎన్విడియా సీఈఓ వివాదం.. ఎవరీ అలిస్ హువాంగ్?











