ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఎస్బీఐ (SBI) మేనేజర్ ఫారం-16 వైరల్ కావడంతో నెట్టింట్లో పెద్ద చర్చ మొదలైంది. ఆ ఫారం-16లో ఆయన వార్షిక వేతనం రూ.35.24 లక్షలు అని ఉండటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ బ్యాంకులో పనిచేసే ఉద్యోగికి ఇంత పెద్ద జీతమా? అనే సందేహం అందరిలోనూ కలిగింది. అయితే.. ఈ సంఖ్య వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకుంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని అర్థమవుతుంది.
వైరల్ అయిన పోస్టు ప్రకారం, ఉద్యోగి ఎనిమిది సంవత్సరాల క్రితం ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)గా చేరి, ప్రస్తుతం స్కేల్-3 మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఫారం-16లో కనిపిస్తున్న రూ.35.24 లక్షలు ఆయనకు ప్రతి నెల వచ్చే జీతం కాదు. అది మొత్తం సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ శాలరీ మాత్రమే.
ఈ గ్రాస్ శాలరీలో ప్రతి నెల వచ్చే జీతంతో పాటు, నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే లభించే.. లీవ్ ఫేర్ కన్సెషన్ (LFC) ఎన్క్యాష్మెంట్, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు కూడా కలిపి ఉన్నాయి. అందుకే మొత్తం జీతం.. చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల వచ్చే ఆదాయం మాత్రం కాదని స్పష్టమవుతోంది.
అంతేకాదు, ఫారం-16లో కనిపించే మొత్తం డబ్బు ఉద్యోగి చేతికి కూడా రాదు. ప్రతి నెలా ఆదాయపు పన్ను, ఎన్పీఎస్ (NPS), ఈపీఎఫ్ (EPF) వంటి తప్పనిసరి కోతలు ఉంటాయి. వీటితో పాటు హోమ్ లోన్, కారు లోన్, బైక్ లోన్ వంటి నెలవారీ ఈఎంఐలు కూడా జీతం నుంచి కట్ అవుతాయి. కాబట్టి.. బ్యాంకు ఖాతాలో జమయ్యే టేక్ హోమ్ శాలరీ గ్రాస్ శాలరీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.
ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు, ఫారం-16 చూసి మాత్రమే ఎవరి జీతాన్ని అంచనా వేయడం సరైంది కాదు. నిజంగా ఉద్యోగి చేతికి ఎంత వస్తుందో కూడా చూడాలి అని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం, ఏమైనా సరే, సంవత్సరానికి రూ.35 లక్షలకు పైగా ప్యాకేజ్ అనేది మంచి జీతమే అని వ్యాఖ్యానించారు. ఇంకొందరు మేనేజర్ ప్రాథమిక వేతనం సుమారు రూ.11-12 లక్షలే అయినప్పటికీ, ఇతర అలవెన్సులు.. ప్రయోజనాలతో కలిపి సంవత్సరానికి మంచి ఆదాయం వస్తుందని తెలిపారు.