కార్పొరేట్ ఉద్యోగాలంటే రూ.లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవనశైలి ఉంటాయనేది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వారి పని గంటలు, పడుతున్న ఒత్తిడి గురించి తెలుసుకుంటే ఇవేం ఉద్యోగాలురా నాయనా.. అనిపిస్తుంది. కార్పొరేట్ ఉద్యోగుల పని గంటలు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటాయనేది ఈ వార్త చదివితే తెలుస్తుంది.
కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఓ 37 ఏళ్ల వ్యక్తి తాను రోజుకు 17 గంటలు పనిచేస్తున్నానని, ఇటీవల తన రక్తపోటు స్థాయిల్లో మార్పుల గురించి ఆందోళన చెందుతూ ట్విటర్లో వైద్యుడిని సంప్రదించాడు. ఆ డాక్టర్ మొదటి సిఫార్సు ఏమిటంటే..
ట్విటర్లో హర్షల్ (@HarshalSal67) అనే వ్యక్తి తన ఆరోగ్య సమస్యపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ను ట్విటర్లో సంప్రదించాడు. ‘హాయ్ డాక్టర్, నాకు 37 ఏళ్లు, కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నాను. గత 6 నెలల నుంచి రోజుకు 16 నుంచి 17 గంటలు పని చేస్తున్నాను. ఇటీవల బీపీ చెక్ చేసుకోగా 150 /90 వచ్చింది. ఇప్పుడేం చేయమంటారు?’ అంటూ ట్వీట్ చేశాడు.
దానికి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పందిస్తూ ‘పని గంటలను 50 శాతం తగ్గించండి. మరో నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే అవకాశం కల్పించండి. అంటే మీ ఉద్యోగంతో పాటు మీరు మరొకరి ఉద్యోగం చేస్తున్నారు’ అని సలహా ఇచ్చారు.
దీంతో డాక్టర్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఉద్యోగం మానేస్తున్నట్లు సదరు వ్యక్తి ప్రకటించారు. దీనికి మంచి నిర్ణయం తీసుకున్నారని డాక్టర్ సుధీర్ అభినందించారు. పలువురు ట్విటర్ యూజర్లు అతని పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు.
1. Reduce working hours by 50%, and ensure an unemployed person gets a job (whose job you are doing in addition to yours)
(+follow other advice from the pinned post on my timeline) https://t.co/wThD7cEvMt— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) June 10, 2023
ఇదీ చదవండి: కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే..