నాలుగేళ్లలోపు పిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరామైన్ మేలేట్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయం, పంపిణీపై ఆంక్షలు విధించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మందులు నాలుగేళ్లలోపు పిల్లలకు వాడకూడదనే హెచ్చరికను ప్యాకేజీలపై తప్పనిసరిగా ముద్రించాలని ఆదేశించింది.
చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరామైన్ మేలేట్ (Chlorpheniramine Maleate), ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) కలిగిన అన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులను నాలుగేళ్లలోపు పిల్లలకు వినియోగించకుండా కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ రెండు పదార్థాలతో కూడిన మందుల తయారీ, విక్రయం, పంపిణీపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇక ప్యాక్‌పై హెచ్చరిక తప్పనిసరి
తాజా ఆదేశాల ప్రకారం.. ఈ కాంబినేషన్‌తో కూడిన మందుల తయారీదారులు లేబుల్, ప్యాకేజీ ఇన్సర్ట్, ప్రచార సామగ్రిపై ‘నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్‌ను ఉపయోగించకూడదు’ అనే హెచ్చరికను స్పష్టంగా ముద్రించాలి. ఈ నోటిఫికేషన్ అధికారిక గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచే అమల్లోకి వస్తుంది.
2025లోనే తొలిసారి ఆంక్షలు
ఈ నిర్ణయం పూర్తిగా కొత్తదేమీ కాదు. 2025 ఏప్రిల్ 15న కేంద్రం ఇదే క్లోర్ఫెనిరామైన్ మేలేట్–ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్‌పై ఆంక్షలు విధించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB) సిఫార్సుల మేరకు నాలుగేళ్లలోపు పిల్లల్లో వీటి వినియోగం వల్ల ప్రమాదాలు ఉండొచ్చని, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది.
తాజా చర్య ద్వారా గత ఆంక్షల పరిధిని మరింత స్పష్టం చేస్తూ ఈ రెండు పదార్థాలు కలిగిన అన్ని సంబంధిత ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఫార్ములాలకు నాలుగేళ్లలోపు పిల్లల విషయంలో ఇదే నిషేధం/వినియోగ పరిమితిని వర్తింపజేశారు.
జలుబు, ముక్కుదిబ్బడకు ఉపయోగించే కాంబినేషన్
క్లోర్ఫెనిరామైన్ మేలేట్ అనేది యాంటీహిస్టమైన్ కాగా, ఫినైలెఫ్రైన్ ముక్కులోని రక్తనాళాల వాపును తగ్గించేందుకు ఉపయోగించే డీకంజెస్టెంట్. ఈ రెండింటినీ కలిపిన మందులను సాధారణంగా జలుబు, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ వంటి లక్షణాల ఉపశమనానికి ఉపయోగిస్తారు. అయితే చిన్నారుల్లో ఇలాంటి కాంబినేషన్ మందులను ఉపయోగించే విషయంలో వయస్సు, మోతాదు, వైద్యుడి సూచనలను అత్యంత జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది.
నిపుణుల సిఫార్సుల ఆధారంగా నిర్ణయం
ఈ కాంబినేషన్ వల్ల నాలుగేళ్లలోపు పిల్లలకు సంభావ్య ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉండవచ్చని నిపుణుల కమిటీ, DTAB అభిప్రాయపడటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పిల్లలకు అందుబాటులో ఉన్న సురక్షితమైన ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ ఆంక్షలను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 26A కింద ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం అమలు చేస్తోంది.