డోన్ రూరల్: ప్రజల నుంచి అధిక వడ్డీలకు కోట్లాది రూపాయలను తీసుకుని అదృశ్యమైన నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా కోర్టులో బుధవారం రూ.210 కోట్లకు దివాలా పిటిషన్ దాఖలు చేశారని తెలిసింది. పట్టణానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి బెంగళూరు పట్టణంలో హౌసో పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. గత పదేళ్లుగా అధిక వడ్డీలకు వందలాది మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నాడు.
గతేడాది చివరిలో ఆయన దేశం విడిచి పారిపోయాడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, బళ్లారి, హోస్పేట్, గుజరాత్ రాష్ట్రానికి చెందిన కొంతమందితో పాటు డోన్ నియోజకవర్గంలోని అతని బంధువుల నుంచి కూడా కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్లు సమాచారం.
అయితే నాలుగు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం కోర్టులో రూ.210 కోట్లకు దివాలా పిటిషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సుమారు 226 మంది వరకు బాధితులు ఉన్నట్లు సమాచారం. శ్రీనివాసరెడ్డి ఐపీ కేసు మార్చి 30వ తేదీన విచారణ ఉన్నట్లు తెలిసింది.