సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో రాత్రి 12.51 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ నెల 26న హనుమకొండలో పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించారు. దాదాపు గంటపాటు శ్రమించి తొమ్మిదిసార్లు సీపీఆర్ నిర్వహించగా.. కొంత స్పందన కనిపించింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.

యశోద ఆస్పత్రిలో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం, ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగినట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, టీసీడీ పరీక్షల్లో నాడీ సంబంధిత స్పందనలో ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.

తెలంగాణ ఉద్యమం ద్వారా..
1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చురుగ్గా పనిచేశారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. 2001లో అప్పటి తెరాస (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. అదే ఏడాది నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. పలువురు పార్టీ నేతలు ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు.