సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఉండేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణలోని వర్షపాతం, చెరువులు, వాగులు, వ్యవసాయంపై ఎలా ప్రభావం చూపుతాయో శాస్త్రవేత్తలతో విశ్లేషించి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పసిఫిక్ మహా సముద్రంలో ఉష్ణోగ్రతల పెరుగుదల నుంచి తెలంగాణ సంసిద్ధత వరకు ‘జరిగిన అంశంపై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సుకు మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సమస్య తీవ్రతను ముందుగానే అర్థం చేసుకుంటే ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం స్వయంగా తగిన ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం ఉంటుందన్నారు. తాగునీరు, సాగునీటితోపాటు పశువులు, పక్షులు, అడవి జంతువుల నీటి, ఆహార అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
సోలార్ విద్యుత్‌తో భారం తగ్గింపు
ఎల్ నినో కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం సమర్థవంతమైన ఎనర్జీ మేనేజ్మెంట్ అమలు చేస్తోందని భట్టి తెలిపారు. పగటి పూట తక్కువ ధరకు లభించే సౌర విద్యుత్‌ను గరిష్టంగా వినియోగించడం ద్వారా ప్రజలపై, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, భూగర్భ జలాలు తదితర శాఖల సమన్వయంతో సదస్సు నిర్వహించడం ప్రభుత్వ సమగ్ర ప్రణాళికకు నిదర్శనమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి అవగాహన సదస్సులను జిల్లాల వారీగా కూడా నిర్వహించి ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులను ఆదేశించారు.
వాతావారణ మార్పులకు అనుగుణంగా..
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి కాకుండా ఆరు తడి పంటలు వేయాలని పలువురు శాస్త్రవ్తేలు సూచించారు. ఇది ఒక ప్రాంతమో, ఒక రాష్ట్రమో ఎదుర్కొంటున్న సమస్య కాదని, ప్రపంచం మొత్తం ఉందన్నారు. దీంతో ధరల ప్రభావం, నీటి కొరత, పశువులకు, పక్షులకు, అడవులు, యావత్ ప్రపంచానికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దీనిపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగహన కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. అయితే వర్షాలు రెండు మూడు నెలల తర్వాత పడే అవకాశం లేకపోలేదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్‌నినో 2027 వరకు కొననసాగే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, పీఆర్ కమిషనర్ దివ్య దేవరాజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి గోపి, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ప్రణాళికా శాఖ డైరెక్టర్ రూఫస్ దత్తం, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ రంగాలపై ప్రభావం తగ్గించేందుకు ముందస్తు చర్యలు
ప్రత్యామ్నాయ పంటలు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్పై దృష్టి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ADVERTISEMENT
ADVERTISEMENT