న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు మొత్తం 8 పతకాలతో మెరిశారు. వీటిలో మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకోగా... మరో 6 రజతాలు, 1 కాంస్యం భారత్ ఖాతాలో చేరాయి. రిషికాంత సింగ్, రాజా ముత్తుపండి, వల్లూరి అజయ్ బాబు, లవ్‌ప్రీత్ సింగ్, జ్ఞానేశ్వరి యాదవ్, హర్జీందర్ కౌర్‌లకు రజతం దక్కగా, బింద్యారాణి దేవి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత లిఫ్టర్ల ప్రదర్శనపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
ప్రశంసలు కురిపించారు. వారు తెచి్చన ప్రతీ మెడల్ దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు.
‘భారత ఆటగాళ్లు ఎప్పుడు పతకం గెలిచినా పార్లమెంట్లో దాని గురించి ప్రకటన తర్వాత సభ ప్రారంభమయ్యేది. ఈసారి మన ముగ్గురు ఆటగాళ్లు పతకం సాధించడంలో విఫలమయ్యారు. అయితే వారు నిరాశపడవద్దు.
ఒక ప్లేయర్ ఎప్పుడూ ఓడిపోడనే విషయం మర్చిపోవద్దు. ఓటమి ఎదురైనా పాఠాలు నేర్చుకొని మళ్లీ గెలిచేందుకు సిద్ధమవుతాడు’ అని మాండవీయ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా వెయిట్లిఫ్టర్లను సన్మానించి నగదు పురస్కారాలు అందజేశారు. మీరాబాయికి రూ.30 లక్షలు... రజత, కాంస్య పతక విజేతలకు వరుసగా రూ. 20 లక్షలు, రూ.10ల చొప్పున చెక్‌లను మంత్రి అందించారు.