రిటైర్మెంట్ వార్తల నడుమ లార్డ్స్ మైదానంలో టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ అద్భుత శతకంతో మెరిశాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం నాటి మూడో వన్డే సందర్భంగా 138 పరుగులు సాధించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన హిట్‌మ్యాన్ ఆ తర్వాత గేరు మార్చి.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలో 110 బంతుల్లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేశాడు. అయితే, జేకబ్ బెతెల్ అనూహ్య రీతిలో రోహిత్‌ను బౌల్డ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (77), వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (74) అర్ధ శతకాలు సాధించినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఓడి టీమిండియా సిరీస్‌ను 1-2తో ఇంగ్లండ్‌కు కోల్పోయింది.
The name is Rohit Gurunath Sharma. 🫡
The occasion? A Lord's century. 💯
Watch #ENGvIND 3rd ODI LIVE NOW on Sony Sports Network TV channels. #SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/G5HoYMO0BV— Sony Sports Network (@SonySportsNetwk) July 19, 2026
రూమర్లు కొత్తేం కాదు
ఇదిలా ఉంటే.. తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ‘‘మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేయడం నా ముఖ్య విధి. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం. నా అరంగేట్రం రోజు నుంచి నేటి దాకా అదే నిబద్ధత, అంకితభావంతో ముందుకు సాగుతున్నాను.
అంతేకాదు నేను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నాటి నుంచే ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాను. నేను మళ్లీ గ్రౌండ్లోకి వెళ్లే దాకా ఈ వదంతులు ఆగవు. అయినా.. ఇలాంటి రూమర్లు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. మైదానంలో నా ఆట తీరు ఎలా ఉందన్నదే ముఖ్యం.
జట్టు విజయం కోసం నా వంతు కృషి చేస్తాను. కేవలం ఆ ఒక్క విషయంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. అయినా ఇలాంటి వదంతులు ఉంటేనే కదా.. మనకూ కాస్త సరదాగా అనిపిస్తుంది. నా పని నాదే. బయట ఎవరి పని వాళ్లదే. వాళ్లు ఇలాంటి రూమర్లతో ప్రాచుర్యం పొందాలనుకుంటారు’’ అని రోహిత్ శర్మ గాసిప్‌రాయుళ్లకు కౌంటర్ వేశాడు.
కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ.. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, లార్డ్స్‌లో రోహిత్ చివరి మ్యాచ్ ఆడబోతున్నాడనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశాడు. కెప్టెన్ గిల్ సైతం ఇవన్నీ కేవలం ఊహాగానాలే అన్నాడు.
మా మధ్య అవగాహన ఉంది
ఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి కలిసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 400 మ్యాచ్‌లలో కలిసి ఆడిన తొలి భారత జోడీగా చరిత్రకెక్కారు. ఈ నేపథ్యంలో రోహిత్ స్పందిస్తూ.. ‘‘మా కెరీర్ తొలి నాళ్ల నుంచి మేము కలిసి ఆడుతున్నాం. ఇప్పటికే మేమిద్దరం కలిసి ఎన్నోసార్లు మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాము.
మధ్య ఓవర్లలో కోహ్లి వస్తే అతడితో కలిసి ఆడటం నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు కూడా ఇద్దరం కలిసే ఆడాము. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఆట మధ్యలో మేము ఎక్కువగా చర్చించుకుంటాము. ఒకరి ఆలోచనలు ఒకరం పంచుకుంటూ.. ఒకరినొకరం అర్థం చేసుకుంటూ బ్యాటింగ్ చేస్తూ ఉంటాము’’ అని కోహ్లితో ఉన్న అనుబంధం, సమన్వయం గురించి చెప్పుకొచ్చాడు.