ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ రేసు నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా నిష్క్రమించింది. నిన్న (ఏప్రిల్ 30) పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో ఈ సీజన్లో ఆ జట్టు ఖేల్ ఖతమైంది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ జట్టు ఈ సీజన్లో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
సీఎస్కేకు ఈ మ్యాచ్‌లు అంత ముఖ్యం కాకపోయినా ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను నిర్ణయిస్తుంది. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ (మే 3), కేకేఆర్ (మే 7), రాజస్థాన్ రాయల్స్ (మే 12), గుజరాత్ టైటాన్స్‌తో (మే 18) తలపడనుంది. పైన ఉన్న జట్లన్నీ ప్లే ఆఫ్స్ రేసులో ఉండటంతో సీఎస్కే నిర్ణయాత్మక శక్తిగా మారనుంది.
ఇదిలా ఉంటే, ఈ సీజన్ ఆరంభంలో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోని సీఎస్కే పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ధోని కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా సీఎస్కే తలరాత ఏమీ మారలేదు. వరుస పరాజయాలతో సతమతమైంది. ఫ్యాన్స్ సైతం చాలా రోజుల కిందటే సీఎస్కేపై ఆశలు వదులుకున్నారు.
ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత ధోని ఓ అపప్రదను మూటగట్టుకున్నాడు. తొలిసారి వరుసగా రెండు ఐపీఎల్ ఫైనల్స్ మిస్ అయ్యాడు (కానున్నాడు). ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతున్న ధోని ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరుసగా రెండు ఫైనల్స్ ఆడకుండా ఉండలేదు.
ఓ సీజన్ మిస్ అయినా మరుసటి సీజన్లోనే ఫైనల్ ఆడాడు. మొత్తంగా ధోని తన ఐపీఎల్ కెరీర్లో 11 ఫైనల్స్ (10 సీఎస్కే తరఫున, ఒకటి రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ తరఫున) ఆడాడు.
ధోని ఆడిన ఐపీఎల్ ఫైనల్స్..
2008 (రన్నరప్)
2010 (ఛాంపియన్)
2011 (ఛాంపియన్)
2012 (రన్నరప్)
2013 (రన్నరప్)
2015 (రన్నరప్)
2017 (రన్నరప్, పూణే తరఫున)
2018 (ఛాంపియన్)
2019 (రన్నరప్)
2021 (ఛాంపియన్)
2023 (ఛాంపియన్)
ధోని ఆడని ఐపీఎల్ ఫైనల్స్
2009
2014
2016
2020
2022
2024
2025