టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. సొంతగడ్డ మీదే పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుంది. అఫ్గానిస్తాన్‌కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సహకారంతో ఏసీబీ భారత్‌లో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్‌లు నిర్వహించుకుంటోంది. ఇందులో భాగంగా సెప్టెంబరులో టీమిండియాకు టీ20 సిరీస్‌లో అఫ్గాన్ ఆతిథ్యమివ్వనున్నట్లు సమాచారం.
డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నోలను తమ హోంగ్రౌండ్లుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు కూడా షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంది. అయితే, ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. తాజాగా టీమిండియాకే భారత్‌లో ఆతిథ్యం ఇచ్చేందుకు అఫ్గాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
టీమిండియా- శ్రీలంక టెస్టు సిరీస్ ... ఆసియా క్రీడలు-2026 మధ్య విరామంలో టీమిండియా- అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 27 నుంచి భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుండగా.. ఆసియా క్రీడలకు సెప్టెంబరు 24న తెర లేవనుంది.
ఈ క్రమంలో సెప్టెంబరు 13 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గాన్ బోర్డు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది.
ఇదిలా ఉంటే.. ఇటీవలే అఫ్గాన్ జట్టు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన అఫ్గాన్.. మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్ అయింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.
పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయిన శ్రేయస్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు.. ఏడు మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది.