‘అమ్మా నువ్వే 42 ఓట్లతో గెలిచావు.. ధ్రువీకరణ పత్రంపై సంతకం చేద్దువు రా’ అని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని అధికారులు పిలిచారు. అంతలోనే పచ్చ నేతలు అడ్డుపడటంతో టీడీపీ అభ్యర్థే గెలిచారు, నువ్వు 6 ఓట్ల తేడాతో ఓడిపోయావు అని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సానివాడ ఎంపీటీసీ స్థానంలో జరిగిన అన్యాయమిది. కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎచ్చెర్ల దివ్య శ్రీధర్‌కు ముందుగా 319 ఓట్ల మెజారిటీ లభించింది. దీంతో టీడీపీ రీకౌంటింగ్ కోరింది.
రీకౌంటింగ్ తర్వాత దివ్యకు 42 ఓట్లు మెజార్టీ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ధ్రువపత్రంపై సంతకం చేయాలని పిలిచారు. అయితే ఈ ప్రాదేశికంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఊరు ఉండటంతో ఎలాగైనా గెలవాలని టీడీపీ అభ్యర్థి అరసవల్లి లక్ష్మీదేవి రీకౌంటింగ్ పెట్టించారు. దీనికి ఎన్నికల అధికారులు, ఆర్ఓ బొడ్డేపల్లి శైలజ సహకారం తోడవ్వడంతో అంకెలను మార్చేసి, ఆరు ఓట్ల తేడాతో దివ్య ఓడిపోయారని, లక్ష్మీదేవి గెలిచారని ఆర్ఓ శైలజ ప్రకటించేశారు. దీంతో దివ్య, ఆమె అనుచరులు నిశ్చేషు్టలయ్యారు. రీకౌంటింగ్ పెట్టాలని దివ్య కోరినప్పటికీ ఆర్ఓ నిరాకరించారు.
అన్యాయం చేశారు..
ఎమ్మెల్యే గొండు శంకర్ బెదిరింపులతో తన భర్త శ్రీధర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని, ఇక్కడ ఎన్నికల అధికారుల సాయంతో తనకు అన్యాయం చేశారని దివ్య కన్నీటి పర్యంతమయ్యారు. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. అక్కడే ఉన్న ఆర్డీఓ సాయి శిరీష, జెడ్పీ సీఈఓ వెంకట్రామన్లు వారికేం సంబంధం లేదని చెబుతున్నారన్నారు.
– అరసవల్లి (శ్రీకాకుళం )











