సాక్షి, తాడేపల్లి: సీఈసీ నియామకంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీజేఐ నేతృత్వంలో సీఈసీ నియామకం జరగాలని.. కేంద్ర, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌లో సంస్కరణలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని వ్యవస్థల్లో మార్పురావాలి.. రాష్ట్రంలోనూ ఎస్ఈసీ నియామక విధానంలో మార్పు రావాలన్నారు.
‘‘2024 ఎన్నికల్లోనూ ఫలితాలు తారుమారయ్యాయి. దాన్ని నేను ఆనాడే ప్రస్తావించాను. కోర్టులకూ కొందరు వెళ్లారు. కానీ వ్యవస్థలో మార్పులు రానంత కాలం మనం ఏమీ చేయలేము. ఎస్ఈసీ, సీఈసీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం సరికాదు. దానికి నాడు మేం కూడా సమర్థించాం. అందుకు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాం. విద్యార్థులే ఎగ్జామినర్‌ను నియమించినట్లుగా ఉంటుంది.
..సీఈసీ ఎంపిక విధానం ఇప్పుడున్నది సరికాదు. నాడు సమర్థించాం. ఆ తప్పు చేశాం. వ్యవస్థలో మార్పు రావాలి. సీఈసీ. ఎస్ఈసీ లో మార్పులు రావాలి. ఎస్ఈసీ నియామకం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేయొద్దు. ఎస్ఈసీని హైకోర్టు సీజే, విపక్షనేత, సీఎం కలిసి నిర్ణయించాలి. సీఈసీని సీజేఐ, విపక్షనేత, పీఎం కలిసి నిర్ణయించాలి. అంతేకానీ, వారి నియామకాలు ఏకపక్షంగా ఉండకూడదు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
’’ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా నాడు చంద్రబాబు హయాంలో చీఫ్ సెక్రటరీ. సీఎస్‌గా అనిల్ చంద్ర పునేఠా విధులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విధుల నుంచి తొలగించింది. అలాంటి అనిల్ చంద్ర పునేఠా పదవీ విరమణ చేసినా.. చంద్రబాబు ఆయన్ను ఇప్పుడు ఎస్ఈసీగా తీసుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా విధులు నిర్వహిస్తున్నారు. అనిల్ చంద్ర పునేఠా చంద్రబాబుకు వీరవిధేయుడు. చంద్రబాబు ఏం చెబితే పునేఠా అది చేస్తున్నారు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: పార్టనర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్









