సాక్షి, దేవరపల్లి: ఏపీలో చంద్రబాబు పాలనలో విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక పొగాకు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లిలో పర్యటించారు. ఈ సందర్బంగా పొగాకు యార్డులో రైతులను పరామర్శించి.. కొనుగోలు కేంద్రం వారితో ముఖాముఖి అయ్యారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ..’చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు నష్టపోతున్నాయి. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో విధ్వంసం కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు. చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ. చంద్రబాబు వల్ల ప్రజలకు బాధే మిగిలింది. 27నెలల బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో రైతులు రోడ్డునపడ్డారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనబడటం లేదా?. బాధిత రైతు కుటుంబాలను కనీసం పరామర్శించలేదు.
చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోయారు. పొగాకుతో పాటు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారు. గిట్టుబాటు ధర రాక వెంకటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పెద్దలు పరామర్శించలేదు. వైఎస్సార్సీపీ హయాంలో పొగాకు ధర రూ.289గా ఉంది. కానీ, ఇప్పుడు కేజీ పొగాకు ధర రూ.236 మాత్రమే పలుకుతోంది. కూటమి ప్రభుత్వం కేవలం 21 శాతమే కొనుగోలు చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో లక్ష వరకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. చంద్రబాబు వచ్చాక సున్నా వడ్డీ పథకం రద్దు చేశారు. రైతు భరోసా సాయంలో కూడా కోతలు పెట్టారు. చంద్రబాబు పాలన రైతులకు హానికరం. కూటమి ప్రభుత్వం దళారీతో రాజీ పడింది. దళారులు సిండికేటుగా మారి రైతుల పొట్టగొడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు.
వైఎస్ జగన్తో ఆవేదన చెప్పుకున్న రైతులు..
అంతకుముందు.. వైఎస్ జగన్తో దేవరపల్లి పొగాకు రైతులు తమ ఆవేదనను చెప్పుకున్నారు. గిట్టుబాటు ధర లేదని వాపోయిన పొగాకు రైతులు. కూటమి ప్రభుత్వం వచ్చాక నష్టపోయామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీగానీ ఇక్కడికి రాలేదన్న రైతులు. 98 శాతం పొగాకును రూ.170కే కొంటున్నారు. మీరు వస్తున్నారని రూ.10 పెంచారు. వైఎస్సార్సీపీ హయాంలో కేజీ పొగాకు రూ.365 ఉంటే ఇప్పుడు రూ.260 మాత్రమే.
వైఎస్సార్సీపీ హయాంలో లక్ష వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో రుణానికి వడ్డీ వసూలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందన్నారు. కేజీ పొగాకుకు రూ.70 నష్టపోతున్నాం. పొగాకు కొనే దాని కంటే రిజక్ట్ చేసేదే ఎక్కువ. ఎకరానికి రూ.3లక్షల పెట్టుబడి.. గిట్టుబాటు రావడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో లోగ్రేడ్ పొగాకు కూడా కొనేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వంతో మేము నష్టపోతున్నాం అని అన్నారు.