కర్ణాటకలో దారుణం జరిగింది. రెండు ఏనుగులు ఘర్షణ పడుతున్న సమయంలో ఒక మహిళా టూరిస్టు వాటిని చూస్తూ అక్కడే ఉంది. ఈ ప్రమాద ఘటనలో ఒక ఏనుగు ఆ మహిళపై పడిపోయింది. దీంతో ఊపిరి ఆడక ప్రాణాలు విడిచింది. కొడుగు జిల్లాలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ రోజు సోమవారం ఈ ఘటన జరిగింది.
చెన్నైకి చెందిన 33 ఏళ్ల జ్యునేష్ దుబారే అనే పర్యాటకురాలు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఏనుగులకు స్నానం చేయిస్తుండగా ఆసక్తిగా తిలకిస్తోంది. అయితే ఆసమయంలో కంచన్ అనే ఏనుగు మార్తాండ అనే మరో ఏనుగుపై దాడి చేసింది. కొంత సేపట్లోనే ఆ ఘర్షణ తీవ్రతరమైంది. దీంతో మావటిలు వాటిని అదుపుచేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంతలోనే మార్తాండా అనే ఏనుగు జ్యూనేష్ దుబారేపై పడిపోయింది. వెంటనే జ్యునేష్ నిలబడే ప్రయత్నం చేసినప్పటికీ మరింతగా తొక్కివేసింది. దీంతో ఆ పర్యాటకురాలు అక్కడికక్కడే మృతిచెందింది.
అయితే ఈ మృతి పట్ల కర్ణాటక అటవీ శాఖ అధికారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బంధించి ఉంచిన ఏనుగులకు శిక్షణ ఇచ్చినప్పటికీ, వాటి ప్రవర్తనను అంచనా వేయడం కష్టమన్నారు. పర్యాటకులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఏనుగుల తొండాలను తాకడం, ఫోటోల కోసం దగ్గరగా నిలబడటం, ఏనుగులను కడగడం లేదా వాటికి ఆహారం పెట్టడం చేయకూడదన్నారు.
కాగా ఇటీవల ఏనుగుల దాడులలో ప్రజలు మృతిచెందడం తీవ్ర కలవరం రేపుతోంది. గత నెలలో, ఛత్తీస్‌గఢ్‌లోని గౌరేలా-పెండ్రా-మార్వాహి జిల్లాలో ఒక అడవి ఏనుగు తొక్కడంతో 55 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఉత్తర ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలోని కతర్నియాఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఒక ఏనుగు తొక్కడంతో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది.ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.