న్యూఢిల్లీ: పదేళ్లకు పైగా తమ ప్రభుత్వం తలపెట్టిన పలు సంస్కరణలతో సామాన్య పౌరులకు భారీ స్థాయిలో లబ్ధి చేకూరుతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం పీటీఐ వార్తాసంస్థకు ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ‘‘నిర్మాణాత్మక సంస్కరణలు, మరింత విస్తృత ఆవిష్కరణలు, మరింత సులభతర పాలన. వచ్చే దశాబ్దంలో ఈ మూడు కీలక సంస్కరణలకు కట్టుబడతా.
సంస్కరణల్లో పోటీతత్వాన్ని, ఉత్పాదకతను పెంచాలి. తర్వాత సాంకేతికత, తయారీ, సేవల రంగంల వినూత్న ఆవిష్కరణలను సుసాధ్యం చేయాలి. పౌరులు, ప్రభుత్వాలు, పరిశ్రమల మధ్య మరింత సమన్వయం సాధించాలి. అప్పుడే పరిపాలన అత్యంత సులభతరం అవుతుంది. ప్రజల విశ్వాసమూ బలపడుతుంది. ఇప్పటికే మేం తెచి్చన సంస్కరణలతో దళారీ వ్యవస్థ దోపిడీ తగ్గిపోయింది. మౌలిక వసతుల విస్తరణతో రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరిగి రవాణా ఖర్చులు భారీగా తగ్గాయి.
సంస్కరణలనే పదం వినగానే ఆర్థిక, పరిశ్రమలకే పరిమితమవుతాం. వాస్తవానికి సంస్కరణలు సామాజిక రంగంలో కీలకమైనవి. ఒకప్పుడు వెనకబాటుకు గురైన ప్రాంతాలు ఇప్పుడు ఆశావహ (ఆస్పిరేషనల్) జిల్లాలు, బ్లాకులుగా అభివృద్ధి చెందాయి. గతంలో అభివృద్ధికి నోచుకోని గిరిజనులకు పీఎం–జన్మన్ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌తో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగింది. దేశాన్ని, ప్రజలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే బలమైన కాంక్ష నాలో రగులుతోంది’’ అని అన్నారు.
అందుకు గర్విస్తున్నా
‘‘నత్తనడకన సాగే దశలవారీ సర్దుబాట్ల స్థాయి నుంచి వ్యవస్థీకృత సంస్కరణల దిశలోకి భారత్‌ను తీసుకొచ్చాం. ఈ విషయంలో ఎంతగానో గర్విస్తున్నా. ఉదాహరణకు వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వచ్చాక రెండు శ్లాబుల పన్నులతో కుటుంబాలు మొదలు సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల, అధిక కార్మిక ఆధారిత రంగాల కష్టాలు తీరాయి. చిన్న కంపెనీల నిర్వహణ వ్యయాలు తగ్గాయి.
బీమా రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో నచి్చన బీమా కంపెనీని పోర్టబుల్‌గా ఎంచుకునే వెసులుబాటు సగటు భారతీయునికి అందుబాటులోకి వచి్చంది. అభివృద్ధికి నోచుకోని రంగాలకు మంత్రిత్వ శాఖలను ఏర్పాటుచేశాం. దాంతో నైపుణ్యాభివృద్ధి, ఫిషరీ, సహకార సంఘాలు, ఆయుష్ వంటివి వేగంగా వృద్ధి చెందుతున్నాయి. యూపీఐ చెల్లింపులతో భారత్ డిజిటల్ లీడర్‌గా ఎదుగుతోంది. స్టార్టప్ల్లోనూ దూసుకెళ్తోంది. మన యువతరం కొత్త ఆర్థికవ్యవస్థను సృష్టిస్తోంది’’ అన్నారు.
సంస్కరణల ఫలాలు సిందూర్ వేళ చేతికి
‘‘భద్రతా సవాళ్లను అన్ని వేళలా సర్వసన్నద్ధంతో ఎదుర్కోవాలి. ఆ మేరకు దశాబ్దం క్రితం చేపట్టిన రక్షణ రంగ సంస్కరణల ఫలాలు ఆపరేషన్ సిందూర్ వేళ చేతికొచ్చాయి. రక్షణ రంగం ఆధునీకరణలో భాగంగా బడ్జెట్లో దానికి కేటాయింపులు ఏకంగా 15 శాతం పెంచాం. రక్షణరంగంలో స్వయంసమృద్ధికి ఎన్డీఏ సర్కారు కృషి చేస్తోంది’’ అని మోదీ అన్నారు.
యూపీఏ ఉండుంటే వాణిజ్య చర్చలు హుళక్కే
‘‘అమెరికా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, బ్రిటన్ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కూటమితో కీలక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాం. దీంతో సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల వంటి అధిక కార్మికుల ఆధారిత పరిశ్రమల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లోకి అవకాశాలు పెరిగాయి. ఇవన్నీ మన పోటీతత్వమున్న స్థానిక పరిశ్రమలు, విశ్వసనీయ ధోరణితో సాధ్యమయ్యాయి. గతంలో యూపీఏ ప్రభుత్వాలు సైతం విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు ప్రయతి్నంచి ఘోరంగా విఫలమయ్యాయి. ఆర్థికనిర్వహణలో అసమర్థతే దీనికి అసలు కారణం. ఇంకా యూపీఏ సర్కార్ ఉండి ఉంటే వాణిజ్య ఒప్పందాలు కలగానే మిగిలిపోయేవి’’ అని మోదీ అన్నారు.
పనిపై ఎప్పుడూ సంతృప్తి చెందను
ప్రజాజీవితం అంటేనే విశ్రాంతిలేకుండా పని చేయడమని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌తో ఒనగూరిన అభివృద్ధి, చేసిన పని విషయంలో నేనెప్పుడూ సంతృప్తి చెందలేదు. ఇంకా బాగా పని చేయాలనుకుంటా. మరింత వేగంగా, మెరుగ్గా పని చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటా. ప్రజల కోసం ఎంతో సాధించాలన్న బలమైన కోరిక నాలో రగిలిపోతుంటుంది. ఎందుకంటే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి’’ అని చెప్పారు.