ముంబై: కొత్తగా పెళ్లైన ఓ జంట తమ తొలి రైలు ప్రయాణాన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చుకోవాలనుకుంది. అందుకోసం రైలులోని కూపేను ఏకంగా హనీమూన్ సూట్‌లా అలంకరించింది. గులాబీ బెలూన్లు, పూలమాలలు, గులాబీ రేకులు, "ఐ లవ్ యూ" బోర్డుతో కూపేను అందంగా తీర్చిదిద్దింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం.. విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే స్పందించాల్సి వచ్చింది..
జూలై 6న ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్–పండర్పూర్ నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ జల్నా స్టేషన్‌కు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బయటకు చెందిన డెకరేషన్ సిబ్బందిని రైలులోకి అనుమతించి, ప్రయాణికుల కూపేను ప్రత్యేకంగా అలంకరించారు. కొద్దిసేపటికే ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వీడియోలు వైరల్ కావడంతో దక్షిణ మధ్య రైల్వే వెంటనే విచారణకు ఆదేశించింది. ప్రయాణికులు తమ సీట్లు లేదంటే కూపేను చిన్నపాటి వ్యక్తిగత అలంకరణలతో అందంగా మార్చుకోవడంపై ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే అనుమతి లేకుండా బయటి వ్యక్తులను రైలులోకి తీసుకురావడం, భారీగా అలంకరణలు చేయడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
What’s happening here 🥺😭🥺😭🥺😭 pic.twitter.com/PGW1TqmyWc
— Godman Chikna (@Madan_Chikna) July 7, 2026
ఈ ఘటనలో అసలు తప్పు కొత్త దంపతులది కాదని, భద్రతా నిబంధనలు పాటించకుండా బయటి వ్యక్తులను అనుమతించిన సిబ్బందిదేనని రైల్వే భావిస్తోంది. దీంతో విధుల్లో ఉన్న ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ను సస్పెండ్ చేశారు. అలాగే అనుమతి ఎలా ఇచ్చారు? భద్రతా తనిఖీలు ఎందుకు విఫలమయ్యాయి? అనే అంశాలపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.
కొత్త దంపతులపై మాత్రం ఎలాంటి జరిమానా లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. రైల్వే దృష్టి మొత్తం భద్రతా నిబంధనల ఉల్లంఘనపైనే ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. కొందరు "ఇలాంటి సర్ప్రైజ్ జీవితంలో ఒక్కసారే వస్తుంది" అంటూ కొత్త దంపతుల ఆలోచనను మెచ్చుకోగా, మరికొందరు ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ఏర్పాట్లకు అనుమతి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు సరదాగా ఈ రైలుకు "సుహాగ్రాత్ ఎక్స్‌ప్రెస్" అని పేరు పెట్టి మీమ్స్ సృష్టించారు.