సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఆగస్ట్ 5వ తేదీ కేలండర్లో ఒక సాధారణ రోజు కాదు. అదొక సంచలన నిర్ణయాలకు ప్రతీక. గతంలో ఇదే తేదీన తీసుకున్న చారిత్రక నిర్ణయాలు దేశ రాజకీయ స్వరూపాన్నే మార్చివేశాయి. సరిగ్గా అదే పంథాలో ఈసారి కూడా ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం నుంచి మరో కీలక ప్రకటన రానుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో.. సరిగ్గా ఆగస్ట్ 5న ఒక కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు, దేశాన్ని విస్మయపరిచే సంచలన నిర్ణయాన్ని ప్రకటించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
దేశ రాజకీయ చరిత్రలో ఆగస్ట్ 5వ తేదీకి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్, వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే.. 2019 ఆగస్ట్ 5న జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టీకల్ 370ను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆగస్టు 5నే ఘనంగా జరిగింది. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బుధవారం ప్రభుత్వం ఎలాంటి సంచలనానికి తెరలేపుతుందనే దానిపై రాజకీయ పరిశీలకులు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. సమూల పాలనా సంస్కరణలు, కీలకమైన సామాజిక, ఆర్థిక సంస్కరణలు లేదా అత్యంత ప్రతిష్టాత్మకమైన చట్టపరమైన సవరణలకు సంబంధించిన బిల్లును తెరపైకి తెచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు, కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపైనా పెద్ద చర్చ నడుస్తోంది.
మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణా? కీలక బిల్లు ఆమోదమా?
ADVERTISEMENT
ADVERTISEMENT