ప్రముఖ జర్నలిస్టు, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన జూనియర్ సహోద్యోగిపై అత్యాచారం జరిపిన కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును గురువారం గోవా బెంచ్ కొట్టేసింది. తద్వారా తేజ్పాల్ను దోషిగా నిర్ధారిస్తూ గురువారం తీర్పును తిరగరాసింది.
2013 నవంబర్‌లో గోవాలో జరిగిన థింక్‌ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా ఓ హోటల్ లిఫ్ట్‌లో తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఓ మహిళా జర్నలిస్టు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. ఆ సమయంలో ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. తిరస్కరణకు గురైంది. దీంతో గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే..
ఈ కేసులో 2014లో ఛార్జ్‌షీట్ దాఖలు కాగా.. 2017లో కోర్టు విచారణ ప్రారంభమైంది. 2021 మేలో గోవాలోని మపుసా ట్రయల్ కోర్టు తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ గోవా ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన జస్టిస్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జంసందేకర్లతో కూడిన ధర్మాసనం ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. అయితే తీర్పు రావడానికి ముందే తేజ్‌పాల్ కోర్టుకు వచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. లైంగిక వేధింపుల బాధితురాలు ఎలా ప్రవర్తించాలనే ముందస్తు అభిప్రాయాలతో ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన వాదించారు. బాధితుల స్పందన అందరిలో ఒకేలా ఉండదని, వ్యక్తిగత పరిస్థితులు, సామాజిక నేపథ్యం, వ్యక్తిత్వం వంటి అంశాలపై ఆధారపడి మారుతుందని పేర్కొన్నారు. తేజ్‌పాల్ తరఫున సీనియర్ న్యాయవాది అబాద్ పొండా వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను పక్కన పెట్టి తేజ్పాల్ను దోషిగా తేల్చింది. దీంతో దాదాపు 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
తెహల్కా-తరుణ్ తేజ్‌పాల్ నేపథ్యం..
తెహల్కా(Tehelka) భారత జర్నలిజం చరిత్రలో సంచలనాత్మక దర్యాప్తు కథనాలకు పేరుగాంచిన ఓ ప్రముఖ వార్తా మ్యాగజైన్. 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ పత్రిక.. స్టింగ్ ఆపరేషన్లు, అవినీతి బహిర్గతాలు, రాజకీయ–కార్పొరేట్ వ్యవహారాలపై చేసిన పరిశోధనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీనిని స్థాపించిన వారిలో తరుణ్ తేజ్‌పాల్(Tarun Tejpal) ఒకరు. ఆయన జర్నలిస్టుగా, రచయితగా సుదీర్ఘ కాలం పనిచేశారు.
1990లలో జర్నలిజంలోకి వచ్చిన తేజ్‌పాల్.. తొలుత పలు ప్రముఖ ప్రచురణ సంస్థల్లో పనిచేశారు. అనంతరం 2000లో తెహల్కా డాట్‌కామ్‌ను ప్రారంభించి, తర్వాత దానిని వార్తా మ్యాగజైన్‌గా తీర్చిదిద్దారు. తెహల్కా చేసిన కొన్ని స్టింగ్ ఆపరేషన్లు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా 2001లో వెలుగులోకి వచ్చిన “ఆపరేషన్ వెస్ట్ ఎండ్” అనే స్టింగ్ ఆపరేషన్ రక్షణ రంగంలో అవినీతి ఆరోపణలపై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కథనాల ద్వారా తెహల్కా పరిశోధనాత్మక జర్నలిజానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే తర్వాతి కాలంలో తేజ్‌పాల్ వ్యక్తిగత జీవితం, సంస్థ నిర్వహణకు సంబంధించిన వివాదాలు కూడా వార్తల్లో నిలిచాయి.