పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఆంక్షలు, నౌకా దిగ్బంధం కొనసాగుతున్న వేళ.. అమెరికా దళాలు రంగంలోకి దిగాయి. హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ కార్గో నౌకపై నిబంధనలు ఉల్లంఘించిందని చెబుతూ చర్యలు చేపట్టింది. దీంతో ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో.. హర్ముజ్‌పై పూర్తి నియంత్రణ మాదే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హర్ముజ్‌లో అమెరికా ఇప్పటిదాకా బ్లాకేడ్కే పరిమితం కాగా.. తాజా దాడులకూ దిగింది. ఇరాన్ పోర్టు వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన పనామా జెండా కలిగిన ఓ కార్గో నౌకను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో ఆ నౌక స్టీరింగ్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని రెండు హెల్ఫైర్ క్షిపణులు ప్రయోగించి దాన్ని నిర్వీర్యం చేశాయి. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారంగా ప్రకటించింది.
హర్ముజ్ దిగ్బంధాన్ని దాటేందుకు ప్రయత్నించిన వాణిజ్య నౌకల్లో ఇప్పటివరకు 55 నౌకలను దారి మళ్లించామని, మూడు నౌకలను నిలిపివేశామని, రెండు నౌకలను తనిఖీ చేశామని అమెరికా వెల్లడించింది. తద్వారా హర్ముజ్‌పై తాము పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సంకేతాలిచ్చింది. అయితే..
హర్ముజ్ మా నియంత్రణలోనే.. ట్రంప్
ఇరాన్ పరిస్థితి “బాగానే సాగుతోంది” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందని, తమ నౌకాదళం అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఇరాన్‌ను నమ్మలేమని, గతంలో ఆ దేశం పలుమార్లు అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు. అంతేకాదు ఇరాన్‌తో చర్చల్లో గత దశాబ్దాల ఘర్షణల్లో జరిగిన నష్టాలకు పరిహారం కోరుతామని ట్రంప్ ప్రకటించడం మరింత ఉద్రిక్తతకు కారణమైంది. అయితే ట్రంప్ తాజా ప్రకటనను ఇరాన్ ఎలా స్వీకరిస్తుందనేది చూడాలి.
మా ఈ డిమాండ్లు.. నిబంధనలు నేరవేరాల్సిందే!: ఇరాన్
హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తమ డిమాండ్లను అంగీకరించాలని ఇరాన్ స్పష్టం చేసింది. అవి..
-
అమెరికా యుద్ధ చర్యలు, బెదిరింపులకు పూర్తిగా ముగింపు
-
ఇరాన్ పోర్టులపై నౌకా దిగ్బంధం ఎత్తివేత
-
అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ
-
యుద్ధ నష్టాలకు పరిహారం
-
ఆంక్షల తొలగింపు
-
స్తంభింపజేసిన ఇరాన్ నిధుల విడుదల.. ప్రాంతీయ కాల్పుల విరమణ.. ఈ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ మూసివేత కొనసాగుతుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధికారి మొహ్సెన్ రెజాయి తెలిపారు.
ఒమన్ మధ్యవర్తిత్వం.. చర్చలు తుది దశలో?
అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు లేవని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. ఒమన్ మధ్యవర్తిత్వంతో హర్ముజ్ భవిష్యత్ నిర్వహణపై చర్చలు జరుగుతున్నాయి. నౌకల రాకపోకల కోసం కొత్త మార్గాలపై ఒప్పందం చివరి దశకు చేరుకుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. ఖతార్ కూడా ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు గణనీయమైన పురోగతిలో ఉన్నాయని పేర్కొంది.
90 డాలర్లకు చేరువలో..
“ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ మార్గం ద్వారా గతంలో చమురు, ఎల్ఎన్జీ రవాణాలో దాదాపు ఐదో వంతు సాగేది. అయితే సంక్షోభంతో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు దాదాపు 90 డాలర్లకు చేరువైంది. హర్ముజ్ మార్గం ద్వారా గతంలో ప్రపంచంలోని చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో ఐదో వంతు రవాణా అయ్యేది.
బాబ్ అల్ మందెబ్‌లో హౌతీ దాడి.. నలుగురు మృతి
మరోవైపు ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందెబ్ జలసంధిలో హౌతీలు వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్థానీలు, ఒక ఇండోనేషియా పౌరుడు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. సౌదీ సైనిక సామగ్రిని తరలిస్తున్న నౌకను లక్ష్యంగా చేసుకున్నామని హౌతీలు ప్రకటించారు. అయితే ఆ నౌక సౌదీ యాజమాన్యంలో లేదని, ఈజిప్టు కంపెనీలకు చెందినదని సమాచారం.
అటు.. వెస్ట్ బ్యాంక్‌లో ఉద్రిక్తతలు
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోనూ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 76 మంది పాలస్తీనియన్లు, వారిలో 18 మంది చిన్నారులు మరణించారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచం చూపు హర్ముజ్‌పైనే!
హర్ముజ్ జలసంధిపై అమెరికా, ఇరాన్ వైఖరులు పరస్పర విరుద్ధంగా కొనసాగుతున్న వేళ.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది. ఒకవైపు అమెరికా పూర్తి నియంత్రణ తమదేనని చెబుతుండగా.. మరోవైపు తమ షరతులు నెరవేరే వరకు హర్ముజ్ తెరవబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది.
చర్చలు పురోగమిస్తాయా? లేదంటే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న. హర్ముజ్ సంక్షోభం పరిష్కారం కాకపోతే.. దాని ప్రభావం చమురు ధరల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు పడే అవకాశం ఉంది.