వాషింగ్టన్ : అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ (Fed) 5 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను (కమిటీలను) ఏర్పాటు చేసింది. కీలకమైన ఈ కమిటీలో ముగ్గురు భార సంతతికి చెందిన నిపుణులు ఉండటం విశేషం. వారిలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మాజీ గవర్నర్, IMF మాజీ చీఫ్ ఎకనామిస్ట్ రఘురామ్ రాజన్ ప్రముఖంగా ఉన్నారు.
గత కొన్ని ఏళ్లుగా అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ద్రవ్య విధాన రూపకల్పనను పునర్రూపకల్పన చేసే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర సంస్కరణల కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ఈ కీలక కమిటీల్లో ముగ్గురు భారతీయ ఆర్థిక నిపుణులను ఎంపిక చేసింది. రఘురామ్ రాజన్‌తో పాటు, ఢిల్లీకిచెందిన అమెరికన్ ఆర్థికవేత్త రాజ్ చెట్టి , మైక్రోసాఫ్ట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మ ఇందులో ఉన్నారు. ఈ ప్రముఖులతో పాటు ప్రపంచ స్థాయి ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఉన్నారు.
రఘురామ్ రాజన్ పాత్ర: బ్యాలెన్స్ షీట్ పాలసీ టాస్క్‌ఫోర్స్' (Balance Sheet Policy Task Force) లో సభ్యుడిగా ఉంటారు. హార్వర్డ్ ఆర్థికవేత్త కారెన్ డైనన్, ఫెడ్ మాజీ గవర్నర్ జెరెమీ స్టెయిన్‌లతో కలిసి ఆయన పనిచేస్తారు. ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుత బ్యాలెన్స్ షీట్ (ఆస్తుల నిల్వలు, బాండ్ల కొనుగోళ్లు విధానం వల్ల కలిగే లాభనష్టాలను, ద్రవ్య విధానంపై దాని ప్రభావాన్ని వీరు సమీక్షిస్తారు.
రాజ్ చెట్టి (Raj Chetty): ఢిల్లీలో జన్మించిన ఈ హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆర్థికవేత్త 'డేటా టాస్క్‌ఫోర్స్' (Data Task Force) కు సహ-నాయకత్వం వహిస్తారు. వాల్‌మార్ట్ మాజీ సీఈఓ డౌగ్ మెక్‌మిలన్, చికాగో యూనివర్సిటీ ఆర్థికవేత్త కెవిన్ మర్ఫీలతో కలిసి ఈయన పనిచేస్తారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నిజసమయ (real-time) ఆర్థిక సంకేతాలు, డేటా నాణ్యతను మెరుగుపరచడం వీరి బాధ్యత.
ఆశా శర్మ (Asha Sharma): మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్‌బాక్స్ (Xbox) సీఈఓ అయిన ఈమె 'ఉత్పాదకత మరియు ఉద్యోగాల టాస్క్‌ఫోర్స్' (Productivity and Jobs Task Force) లో సభ్యురాలిగా ఉంటారు. సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీస్సెన్, స్టాన్ఫోర్డ్ ఆర్థికవేత్త చార్లెస్ ఐ. జోన్స్‌లతో కలిసి ఈమె పనిచేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కొత్త టెక్నాలజీల వల్ల ఉద్యోగాలు, దేశ ఆర్థిక వృద్ధిపై ఎలాంటి ప్రభావం పడుతుందో వీరు అంచనా వేస్తారు.
5 టాస్క్‌ఫోర్స్‌లు- లక్ష్యం
కొత్తగా నియమితులైన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ (Kevin Warsh) ఈ 5 టాస్క్‌ఫోర్స్‌లను ప్రకటించారు. గడిచిన ఐదేళ్లకు పైగా అమెరికాలో ద్రవ్యోల్బణం ఫెడ్ లక్ష్యం కంటే ఎక్కువగా ఉండటంతో, సరికొత్త ఆలోచనలతో వ్యవస్థను బలోపేతం చేయడం మరియు నిర్ణయాల్లో పారదర్శకతను పెంచడం కోసం ఈ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కమ్యూనికేషన్స్, బ్యాలెన్స్ షీట్ పాలసీ, డేటా, ఉత్పాదకత-ఉద్యోగాలు, ద్రవ్యోల్బణ విధానాలు(inflation framework) అనే 5 ప్రధాన రంగాలపై ఈ టాస్క్‌ఫోర్స్‌లు దృష్టి పెడతాయి.