మాడ్రిడ్ : స్పెయిన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు హై-స్పీడ్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న భయంకర ప్రమాదంలో కనీసం 46 మంది ప్రాణాలు కోల్పోగా,అధిక సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
స్పెయిన్‌లోని మాడ్రిడ్ - అండలూసియా మార్గంలో లోస్ యెబెనెస్, ఉర్డా (టోలెడో) ప్రాంతాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. మాడ్రిడ్ నుండి సెవిల్లె వెళ్తున్న రెంఫే అవే రైలు, ఎదురుగా వస్తున్న ఇరియో కంపెనీకి చెందిన మరో హై-స్పీడ్ రైలును ఢీకొట్టింది. ఈ తీవ్రమైన దాటికి రైలు బోగీలు పట్టాలు తప్పాయి. చెల్లాచెదుగా పడ్డాయి. ఈ ఘటనలో 46 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయినట్లు సమాచారం.
ప్రధాని పెడ్రో శాంచెజ్ దిగ్భ్రాంతి
టోలెడోలో జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంపై స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవాణా శాఖ మంత్రి, కాస్టిల్లా-లా మాంచా అధ్యక్షులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, బాధితులను ఆదుకోవడానికి అత్యవసర సేవల సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని వెల్లడించారు.
దుర్ఘటనతో అగ్నిమాపక బృందాలు, మూడు హెలికాప్టర్లు, రెండు మొబైల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లతో సహా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నట్లు స్పానిష్ అత్యవసర సేవల ప్రతినిధి తెలిపారు. మరోవైపు, ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రధాని శాంచెజ్‌తో పాటు ఇతర రాజకీయ నాయకులు రాబోయే పార్లమెంటరీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో సహా నేటి అన్ని బహిరంగ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.












