→ 1991లో భారత్ ఎదుర్కొన్న చెల్లింపుల (విదేశీ మారకం–ఫారెక్స్) సంక్షోభం లాంటిదేదీ ఇప్పుడు తలెత్తే అవకాశం లేదు. మన దగ్గర పుష్కలంగా ఫారెక్స్ నిల్వలున్నాయి. ప్రస్తుతం ధరల సర్దుబాటే అతిపెద్ద సమస్య.
→ మన ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలకు సంబంధించి చర్చ మొత్తం డాలరుతో రూపాయి విలువ పతనం, ఫారెక్స్ నిల్వల చుట్టూనే తిరుగుతోంది. విదేశీ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి? కరెన్సీ స్పెక్యులేషన్‌కు అడ్డుకట్ట ఎలా వేయాలి వంటి పరిష్కార మార్గాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కానీ, ప్రధానంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యను రెండు కోణాల్లో చూడాలి.
→ పశ్చిమాసియా యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రికత్తల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కొండెక్కినప్పుడు దానికనుగుణంగా దేశీయంగానూ ధరలు సర్దుబాటు
అవ్వాల్సిందే. కాబట్టి, పెట్రో రేట్లతో సహా కొన్ని ఉత్పత్తుల రేట్ల పెంపు అనివార్యం.
→ ఇక రెండోది, అసలు రూపాయి క్షీణత అనేది సమస్యే కాదు. ఎందుకంటే, పశ్చిమాసియాలో యుద్ధం మొదలవ్వకముందే అత్యంత బలహీన కరెన్సీల్లో ఒకటిగా మన రూపాయి ఉంది. అంటే ఎకానమీలో మరింత విస్తృతమైన నిర్మాణాత్మక సమస్యలు కూడా ఉన్నాయని అర్థం.
→ భారీ ఇంధన, ఎరువుల సబ్సిడీలు అనేక ఏళ్లుగా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం నిరవధికంగా కొనసాగించం సాధ్యం కాదు. మార్కెట్‌కు అనుగుణంగా ధరలను పెరగనివ్వాలి. అయితే, ఆ షాక్‌కు తగలకుండా పేదలను ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఆదుకోవాల్సిందే.
→ జనధన్, ఆధార్, మొబైల్(జామ్) ద్వారా డిజిటల్ రంగంలో మనం భారీగా పురోగతి సాధించాం, భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ అసలైన డీబీటీ వ్యవస్థ ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు.
→ ఉదాహరణకు, ఎరువులనే తీసుకుందాం. యూరియాపై కేంద్రం భారీ సబ్సిడీ భరిస్తోంది. అలాగే దాన్ని ఉపయోగించే రైతులకు నగదు సాయం (పీఎం కిసాన్) కూడా ఇస్తోంది. ఆ రెండింటినీ అనుసంధానించే పథకం కొరవడింది. యూరియా ధరలు పెరిగితే, మీరు అధిక రేట్లు చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఆ అదనపు భారాన్ని ఆదాయ బదిలీల రూపంలో ప్రభుత్వం మీకు తిరిగి చెల్లిస్తుందని చెప్పే వ్యవస్థ మన దగ్గర లేదు.
→ విద్యుత్, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు తదితర రంగాల్లో సబ్సిడీలను తగ్గించుకుంటూ... ఆర్థికంగా అత్యంత బలహీన వర్గాలకు రక్షణ కల్పించే విధంగా డీబీటీ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ మార్పులు క్రమంగా జరగాలి. మన విధానకర్తల మందున్న అసలైన సవాలు ఇదే.
– అరవింద్ సుబ్రమణియన్, ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ)
ఎకానమీటాక్
ADVERTISEMENT
ADVERTISEMENT