కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ) నిబంధనల సరళీకరణ విదేశీ సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ సీనియర్ అధికారి శివహరి పేర్కొన్నారు. 10 శాతంలోపు చైనీస్ వాటా కలిగిన ఇతర దేశాలకు చెందిన సంస్థలు దేశీయంగా ఎంపిక చేసిన రంగాలలో పెట్టుబడులు చేపట్టేందుకు ఆటోమాటిక్ మార్గంలో అనుమతి లభిస్తుందని తెలియజేశారు. అయితే చైనా, హాంకాంగ్ లేదా ఏ ఇతర సరిహద్దు పంచుకుంటున్న దేశాని(ఎల్బీసీ)కైనా తాజా సవరణలు వర్తించవని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య శాఖ(డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ జై ప్రకాష్ శివహరి వెల్లడించారు.
ఇప్పటివరకూ సరిహద్దు దేశాల వాటాదారులుగా ఉన్న విదేశీ సంస్థలు దేశీయంగా ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవలసి ఉండేదని వివరించారు. ఈ నెల 10న కేంద్ర కేబినెట్ 2020 ప్రెస్ నోట్ 3లో సవరణలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిపై శివహరి తాజా వివరణ ఇచ్చారు. వెరసి సరిహద్దు దేశాలన్నిటికీ ఎఫ్డీఐ ఆంక్షలు అమల్లో ఉన్నట్లు తెలియజేశారు. నాన్ఎల్బీసీ సంస్థలు 10 శాతంలోపు ఎల్బీసీ వాటాదారులుగా ఉన్నప్పుడు కొన్ని రంగాలలో ప్రత్యక్ష పెట్టుబడులకు తాజా సవరణల ద్వారా ఆటోమాటిక్ అనుమతి లభిస్తుందని వివరించారు.