ఉద్యోగంలో మంచి పనితీరును కనపరిస్తే.. బాస్ నుంచి ప్రశంసలు లభిస్తాయి, ఇంకా బాగా పనిచేస్తే ప్రమోషన్లు, బోనస్‌లు వస్తాయి. కానీ ఒక ఉద్యోగి తన పనితీరుతో ఏకంగా రూ.కోట్ల విలువైన కారును గిఫ్ట్‌గా అందుకుంటే మాత్రం అది నిజంగా ప్రత్యేకమనే చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
దుబాయ్‌కు చెందిన రిచ్కీ ప్రాపర్టీస్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ దబన్ ఓత్మాన్ తమ ఉద్యోగికి ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. సంస్థలో రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న నటాలియా చావెజ్‌కు ఖరీదైన కారును గిఫ్ట్‌గా అందించారు. దీనికి కారణం ఆమె సాధించిన అసాధారణ విజయం. గత రెండేళ్లలో నటాలియా ఏకంగా 500 మిలియన్ డాలర్లకు పైగా విలువైన రియల్ ఎస్టేట్ డీల్స్‌ను పూర్తి చేశారు.
కంపెనీ మూడో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఈ గిఫ్ట్ అందించారు. ఈ వేడుకలో నటాలియాను 2026 సంవత్సరానికి గాను టాప్ పెర్ఫార్మర్గా ప్రకటించారు. దీంతో ఆమె వేదికపైకి వెళ్లి సీఈఓ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఇక అవార్డు తీసుకున్న తర్వాత తిరిగి తన సీటుకు వెళ్లబోతుండగా సీఈఓ ఆమెను ఆపారు.
లంబోర్గిని గిఫ్ట్
ఇంకా కార్యక్రమం పూర్తికాలేదని, మరో సర్ప్రైజ్ ఉందంటూ.. అందరిలో ఆసక్తి పెంచారు. ఆ తర్వాత కౌంట్‌డౌన్ ప్రారంభించి, రిబ్బన్ కటింగ్ ద్వారా కొత్త నీలిరంగు లంబోర్గిని ఉరుస్ కారును ఆమెకు చూపించారు. అంతే.. ఒక్కసారిగా నటాలియా ఆనందంలో మునిగిపోయారు. కేవలం అవార్డు మాత్రమే వస్తుందని భావించిన ఆమెకు ఇంత ఖరీదైన కారు గిఫ్ట్‌గా రావడంతో ఆశ్చర్యపోయారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
లంబోర్గిని ఉరుస్ కారు ధర విషయానికి వస్తే.. దుబాయ్ మార్కెట్లో దీని ధర సుమారు 9 లక్షల నుంచి 15.5 లక్షల UAE దిర్హామ్‌ల మధ్య ఉంటుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుంది.