సాక్షి, అమరావతి/సాక్షిప్రతినిధి కర్నూలు/సాక్షి,నెట్వర్క్: చంద్రబాబు రెండేళ్ల రాక్షసపాలనపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. సర్కారు వైఫల్యాలపై గళమెత్తి గర్జించింది. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో గురువారం నుంచి 12 తేదీ వరకు మహోద్యమానికి శ్రీకారం చుట్టింది. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దగాకోరు సర్కారుకు వ్యతిరేకంగా కదంతొక్కింది. పోలీసు ఆంక్షలు, అణచివేతలను ధిక్కరించి రణన్నినాదం మోగించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి వెన్నుపోటే తన నైజమని బాబు మరోమారు నిరూపించుకున్నారని నిప్పులు చెరిగింది.
పిల్లనిచ్చిన మామ నందమూరి తారకరామారావు నుంచి నేడు రాష్ట్ర ప్రజల వరకు అందరూ బాబు బాధితులేనని, ఈ దుష్ట పాలన రాష్ట్రానికి హానికరమని దుయ్యబట్టింది. ‘చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడవడం మినహా చేసింది ఏమీ లేదు. సూపర్‌సిక్స్ హామీల్లోని ఆడబిడ్డనిధి, నిరుద్యోగ భృతిని గాలికొదిలేశారు. వలంటీర్లకు రూ.10వేల వేతనం ఇస్తామని చెప్పి దగా చేశారు. దగాకోరు బాబు నుంచి ప్రజలను కాపాడేందుకు అలుపెరగని పోరాటం చేస్తాం. మహోద్యమానికి ఉద్యుక్తులమవుతాం. నారాసురుడిని గద్దె దించే వరకు విశ్రమించం’’ అంటూ వైఎస్సార్సీపీ నేతలు ప్రతినబూనారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా సాగిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అన్ని జిల్లాల్లో ఎగిసిన ఆగ్రహజ్వాలలు
గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. గుంటూరు గుజ్జనగుండ్ల, చుట్టుగుంట సెంటర్లలో టీడీపీ మేనిఫెస్టో ప్రతులు దహనం చేశారు. వైఎస్సార్సీపీ నేతలను రెచ్చగొట్టేందుకు టీడీపీ నేతలు వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నవైఎస్సార్‌సీపీ శిబిరం వద్దకు వచ్చి రెచ్చగొట్టే నినాదాలుచేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్లలో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అయినా పోలీసుల అడ్డంకులను అధిగమించి నేతలు ప్రదర్శనను జయప్రదం చేశారు. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, రొంపిచర్లలో నిరసన కార్యక్రమం జరిగింది.
పెదకూరపాడులో సూపర్‌సిక్స్ హామీల ప్రతులను దహనం చేశారు. వినుకొండలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై సీఐ ప్రభాకర్‌రావు జులుం ప్రదర్శించారు. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మాచర్ల, సత్తెనపల్లి, గురజాలల్లో వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. అనంతపురం అంబేడ్కర్ సర్కిల్లో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉమ్మడి అనంతపురం వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు సాగాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. నంద్యాల కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో ప్రతులను, ప్రజలకు ఇచ్చిన హామీల బాండ్లను దహనం చేశారు. 
గుంటూరులో ర్యాలీగా వస్తున్న మాజీ మంత్రి అంబటి, ప్రజలు
పోలీసులు అడ్డుకున్నా...
శ్రీకాకుళం జిల్లాలో నిరసన ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకునే యత్నం చేసినా వైఎస్సార్సీపీ నేతలు వెనుకడుగు వేయలేదు. పలాస నియోజకవర్గం మందసలో మానవహారం నిర్వహించారు. నరసన్నపేటలో మానవహారం చేపట్టి టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. తిరుపతి, వెంకటగిరి, సూళ్లూరుపేటల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. రైల్వేకోడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో మండుటెండనూ లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కారక్రమాలు చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టో, సూపర్‌సిక్స్ హామీల బాండ్ ప్రతులను దహనం చేశారు. 
విశాఖలోని అక్కయ్యపాలెం హైవేపై మానవహారం నిర్వహించేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పెందుర్తి, గాజువాకలో మానవహారం నిర్వహించి ఫ్లకార్డులు ప్రదర్శించి టీడీపీ మేనిఫెస్టోలను దహనం చేశారు. ఏలూరు, నూజివీడు, పోలవరంల్లో నిరసనలు చేపట్టారు. చిత్తూరు జిల్లాలో నిరసనలు జరిగాయి. వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. నగరి, కార్వేటినగరం, పూతలపట్టు, బంగారుపాళ్యంలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బాపట్ల జిల్లా వేమూరు, రేపల్లెల్లో చంద్రబాబు దిష్టి»ొమ్మను వైఎస్సార్సీపీ నేతలు దహనం చేశారు.
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిరసన ప్రదర్శనలు దిగ్విజయంగా సాగాయి. రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లాల వ్యాప్తంగా నిరసనలు చేసి టీడీపీ మేనిఫెస్టోలు దహనం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు కదంతొక్కారు. అల్లూరి జిల్లా పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు.ఉమ్మడి విజయనగరం జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగానూ నిరసనల ప్రదర్శనలు జరిగాయి. కొన్నిచోట్ల టీడీపీ మేనిఫెస్టో ప్రతులను వైఎస్సార్సీపీ నేతలు చించివేశారు. కొన్ని చొట్ల దహనం చేశారు. ఈ దహనం కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.
రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ
నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసనల హోరు
రాష్ట్రానికి చంద్రబాబు హానికరం
నమ్మించి గొంతుకోయడమే ఆయన నైజం
రెండేళ్ల పాలనంతా దగానే.. వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
ఆంక్షలు, అణచివేతలను ధిక్కరించి గర్జించిన విపక్షం
ప్రజల నుంచి వెల్లువెత్తిన అపూర్వ స్పందన
స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు సర్కారుకు బుద్ధి చెబుతామని స్పష్టీకరణ
ADVERTISEMENT
ADVERTISEMENT