సాక్షి, అమరావతి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టింది. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని అందించిన నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డేనని పేర్కొంటూ... ‘థ్యాంక్యూ జగన్ అన్నా‘ అనే సందేశాన్ని శనివారంపోస్టు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్యాగ్ చేసింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణ, నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం, అవసరమైన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి కీలక ప్రక్రియలు పూర్తయ్యాయని పార్టీ వెల్లడించింది. భూసేకరణ, పరిహారం, అనుబంధ మౌలిక వసతుల కోసం దాదాపు రూ.1,200 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. విమానాశ్రయం నిర్మాణానికి అవసరమైన పునాది పనులన్నింటినీ వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేయగా, ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను కూడా అదే ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేసింది.
ఈ ప్రాజెక్టులో ప్రస్తుత సీఎం చంద్రబాబు పాత్ర ఏమీ లేకపోయినా, మొత్తం ఘనతను తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసని, అందుకే ‘థ్యాంక్యూ జగన్ అన్నా‘ అంటూ ప్రజలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆ పోస్టులో పేర్కొంది.