సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల CEOకి లేఖ రాశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026 (Special Intensive Revision) ప్రక్రియలో అనేక లోపాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా విశ్వసనీయత దెబ్బతినకుండా మరో నెల గడువు ఇవ్వాలని అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్యుమనరేషన్ ఫారాలు ఇవ్వకుండానే పంపిణీ చేసినట్లు తప్పుడు నమోదు జరుగుతోందని ఆయన ఆరోపించారు.
బీఎల్వోల పంపిణీపై ర్యాండమ్ వెరిఫికేషన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 30 శాతం ఫారాలకే డిజిటలైజేషన్ పూర్తయింది. అనేక నియోజకవర్గాల్లో అది 20 శాతం కూడా దాటలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటలైజేషన్ పూర్తయ్యే వరకు సర్ తదుపరి దశలు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గిరిజన, అటవీ, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలని సూచిస్తూ, ఓటర్ల హక్కులను కాపాడేందుకు ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని CEOను కోరారు. ఈ లేఖలో అప్పిరెడ్డి ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.