సాక్షి,విశాఖ: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ కారె చిన్నాను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో మాట్లాడిన వైఎస్ జగన్, జరిగిన ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆ రాత్రి సముద్రంలో ఏం జరిగింది? ప్రమాదం తర్వాత తాము ఎలా బయటపడేందుకు ప్రయత్నించారు? తానొక్కడే అంత దూరం ఎలా ఈదుకుంటూ వచ్చారు? చివరకు తనను ఎవరు రక్షించారు? వంటి వివరాలను మత్స్యకారుడు చిన్నా వైఎస్ జగన్కు వివరించారు.
చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో చిన్నా ఒక్కరే ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదంపై సమాచారం అందినప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని మత్స్యకార కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల స్పందనపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం అప్పు చేసి పడవను కొనుగోలు చేశామని, ప్రస్తుతం జీవనాధారం కోల్పోయామని చిన్నా వైఎస్ జగన్కు వివరించారు. తమను ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్, చిన్నాకు ధైర్యం చెప్పారు. అవసరమైతే స్వయంగా విశాఖకు వచ్చి పరామర్శిస్తానని తెలిపారు. పడవ కోల్పోతే మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుందని వైఎస్ జగన్ పేర్కొంటూ, ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.
కాగా, ఈ ప్రమాదంలో మత్స్యకారులు మరణించారని ప్రకటించిన ప్రభుత్వం ఆ ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించింది. కానీ,ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాను మాత్రం పట్టించుకోలేదు. కనీసం ఏ అధికారి కూడా వచ్చి పలకరించలేదు. తనను ఏ విధంగా కూడా ఆదుకోకపోగా, దాదాపు రూ.50 లక్షల విలువైన పడవ సముద్రంలో మునిగిపోయిందని, అందుకని ఎలాగైనా ఆదుకోవాలని చిన్నా వైఎస్ జగన్ను వేడుకున్నారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్, ఈ విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అవసరం అయితే తాను కూడా స్వయంగా విశాఖకు వస్తానని వైఎస్ జగన్, మత్స్యకారుడు చిన్నాకు ధైర్యం చెప్పారు.