సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆయన్ని కలిసేందుకు భారీ ఎత్తున యువత తరలివచ్చారు. క్యాంప్ కార్యాలయం వద్ద బారులు తీరారు
.
ప్రజల నుంచి వైఎస్ జగన్ వినతులు స్వీకరించారు. సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్ జగన్కు ప్రజలు ఫిర్యాదు చేశారు. కూటమి పాలనలో పేదలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.

వైఎస్ జగన్ను కలిసిన ఉపాధ్యాయులు
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైఎస్ జగన్కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నిబంధన సరికాదని వైఎస్ జగన్కు ఉపాధ్యాయులు వివరించారు. బీఈడీతో ఉద్యోగం పొందిన 25 ఏళ్ల తర్వాత మళ్లీ టెట్ రాయాలనడం సరికాదని ఉపాధ్యాయులు అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రంతో మాట్లాడతారని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. సమస్యను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కాగా, రేపు(జులై 8, బుధవారం) ఉదయం వైఎస్ జగన్.. పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు.
