వెవీయూ: వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని అక్కాయపల్లెకు చెందిన ఆటోడ్రైవర్ హరిప్రసాద్, రమాదేవి దంపతుల కుమార్తె జానగొండ అరుణ పార్లమెంట్లో ఉపన్యసించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఇలాంటి అవకాశం 25 మందికి దక్కగా, ఏపీ నుంచి ఈమె ఒక్కరే ఉండటం విశేషం.గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2న నూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో మహాత్మాగాంధీ జీవితచరిత్రపై అరుణ ప్రసంగించనుంది.
ఈమె కడపలోని శ్రీవివేకానంద మహిళా డిగ్రీ కళాశాలలో గతేడాది డిగ్రీ పూర్తిచేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంఎస్సీ (మ్యాథ్స్) చదువుతోంది. చిన్నప్పటి నుంచి కో–కరికులర్, ఎక్స్ట్రా–కరికులర్ యాక్టివిటీస్‌లో రాణిస్తోంది. ఈమె విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పూర్తి చేసింది. 2017లో ఇంటాక్ రీజినల్ పురస్కారాన్ని అందుకున్న ఈమె పలు వ్యాసరచన పోటీల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో విజేతగా నిలిచింది.
నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ‘జాతీయ నాయకులకు నివాళి’ అనే కార్యక్రమంలో భాగంగా ‘మహాత్మాగాంధీ జీవనవిధానం, ఆయన అనుసరించిన పద్ధతులు: ప్రపంచంపై ఎనలేని ప్రభావం’, ‘అమృత్‌కాలంలో లాల్‌బహదూర్‌శాస్త్రి జీవితపాఠాలు’ అంశంపై ఎంపికలు జరిగాయి. జిల్లాస్థాయిలో విజేతలకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించగా, ఇందులో అరుణప్రతిభ కనబరచడంతో ఆమెకు ఈ అవకాశం దక్కింది. అరుణ మాట్లాడుతూ తనకు గాంధీ సిద్ధాంతాలు అంటే ఎంతో గౌరవమని, ఆయన మార్గాన్నిఅనుసరిస్తుంటానని..ప్రస్తుతం యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నానని తెలిపింది. కాగా, గతంలో కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీకళాశాల విద్యార్థిని మిద్దె రూప ఇలాంటి అవకాశాన్ని దక్కించుకోగా ఇప్పుడు ఆ అవకాశం అరుణకు దక్కింది.