ఆమదాలవలస రూరల్: తాను లేకపోతే తన బిడ్డలు ఈ లోకంలో ఎలా బతుకుతారని కలత చెందిందో ఏమో ఆ మాతృహృదయం కర్కశంగా మారిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డల గొంతు కోసం హతమార్చింది. ఆపై తానూ గొంతు కోసుకుంది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. ఆమదాలవలస రూరల్ మండలం వెదుళ్లవలసకు చెందిన తల్లి కూర్మాపు వరలక్ష్మి అనే మహిళ తన కుమార్తెలు భవానీ (3), చాందిని (4నెలలు)లను గొంతుకోసి హతమార్చింది. ఆమె కూడా గొంతు కోసుకుంది.
ప్రస్తుతం కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె భర్త రమణ వరంగల్లో కూలి పనులు చేస్తున్నారు. అత్త వేధింపులను తట్టుకోలేక పిల్లలను హతమార్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి రెండుగంటల వరకు అత్తాకోడళ్లు ఘర్షణ పడ్డారని, దీంతో అత్త వేధింపులు భరించలేక పిల్లలను హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు.
వేకువజామున ఈ ఘటన జరిగి ఉండవచ్చని, పొద్దున్నే అత్త తలుపులు తట్టగా స్పందన లేకపోవటంతో చుట్టు పక్కల ఉన్నవారిని పిలిచి చూడగా రక్తపు మడుగులో తల్లీపిల్లలు కనిపించారని తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద్, ఆమదాలవలస సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్ఐ ఎస్.బాలరాజు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.