సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా జూన్ 15 నుంచి ఈ నెల 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇంటింటి సర్వేలో 44,89,488 మంది ఓటర్ల వివరాలు తెలియలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,71,38,206 మంది (89.22 శాతం) నుంచి మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి వచ్చినట్లు తెలిపారు. ఇంటింటి సర్వేలో 15,22,174 మంది ఓటర్లు మరణించినట్లు గుర్తించారని పేర్కొన్నారు. అదేవిధంగా 14,43,886 మంది శాశ్వతంగా ఇతర నియోజకవర్గాలకు వలస వెళ్లారని, మరో 7,37,216 మంది డబుల్ ఎంట్రీ ఓటర్లు ఉన్నారని వివరించారు.
ఇక 7,77,885 మంది ఓటర్ల వివరాలను అసలు గుర్తించలేకపోయినట్లు తెలిపారు. వివిధ కారణాల వల్ల 8,327 మంది ఎన్యూమరేషన్ ఫారాలను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. దానిపై అభ్యంతరాలను తెలపడానికి నెల రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన రోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని వివరించారు. ఏదైనా ఓటు చేర్చడం లేదా తొలగించడం లేదా ఏదైనా సవరణ చేయాలన్నా సంబంధిత పత్రాల ద్వారా అభ్యంతరాలను తెలియజేయాలని కోరారు. ఆగస్టు 30లోగా వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించి అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని తెలిపారు.
ఇంటింటి సర్వే ప్రకారం వెల్లడించిన గణాంకాలు
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు: 4,16,27,694
ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చినవారు: 3,71,38,206
మరణించిన ఓటర్లు: 15,22,174
శాశ్వతంగా ఇతర నియోజకవర్గాలకు వెళ్లిపోయినవారు: 14,43,886
డబుల్ ఎంట్రీ ఓటర్లు: 7,37,216
అసలు గుర్తించలేకపోయిన ఓటర్లు: 7,77,885
ఎన్యూమరేషన్ ఫారాలు తిరస్కరించినవారు: 8,327
రాష్ట్రంలో 89.22% మందే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు
ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన
ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు.. ఓట్ల మార్పు,
చేర్పులు, తొలిగించేందుకు ఆగస్టు 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడి
ADVERTISEMENT
ADVERTISEMENT