సాక్షి, అమరావతి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వస్తే అదనంగా 2,536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళల సంఖ్య 2.62 కోట్లు. దీంతోపాటు వారు ప్రస్తుతం చేసే ప్రయాణాలను బట్టి ఉచిత పథకం అమలైతే ఏడాదికి 88.90 కోట్ల ప్రయాణాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి రూ.996 కోట్లు వ్యయం కానుందని లెక్కగట్టింది.
దీనికి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలుపై దృష్టిసారించాలని, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో చర్చించారు. ఇకపై ఆర్టీసీలో ప్రవేశపెట్టేవన్నీ ఈవీ ఏసీ బస్సులే ఉండాలని, ఇప్పుడున్న బస్సులను కూడా ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని చెప్పారు. ప్రతి బస్సుకూ జీపీఎస్ అమర్చాలని ఆదేశించారు.
స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం
స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యమివ్వాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. శనివారం మున్సిపల్ శాఖపై సీఎం సమీక్షించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున చేపట్టాల్సిన పారిశుద్ధ్య చర్యలను వివరించారు. విద్యుత్ పొదుపుపై దృష్టి సారించాలని ఆదేశించారు. అన్నక్యాంటీన్లలో నాణ్యతపై చర్చించారు.