సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో సరికొ త్త విభాగం ఏర్పాటైంది. భూపరిపాలన ఆవిష్కరణలు, న్యాయ సహకారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పా టు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ చట్టాల విషయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న నిష్ణాతులైన ముగ్గురితో ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ బుధవారం జీవో నెం.8 జారీ చేశారు.
న్యాయశాస్త్రంలో డిగ్రీ చదివి, భూమి సమస్యలపై న్యాయపరంగా కనీసం 20 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుడు ముఖ్య సలహాదారుగా, 10 ఏళ్ల అనుభవం ఉన్న ఇద్దరు సలహాదారులుగా ఈ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సెల్ ఏం చేయాలన్న దానిపై కూడా ఈ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చారు. ఆ ఉత్తర్వుల ప్రకారం...
» రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న భూమి చట్టాల్లో సవరణలు సూచించడంతోపాటు అవసరమైనప్పుడు కొత్త చట్టాల రూపకల్పనకు ఈ సెల్ పనిచేస్తుంది.
» అన్ని రకాల భూమి సమస్యల పరిష్కారానికి ఏం చేయాలన్నది సూచిస్తుంది.
» ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న భూ రికార్డుల కంప్యూటరీకరణ ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీఐఎల్ఆర్ఎంపీ కార్యక్రమాన్ని అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణలో భూమి రికార్డుల కంప్యూటరీకరణ చేపట్టాల్సిన చర్యలను సూచిస్తుంది.
» ప్రస్తుత భూ, రెవెన్యూ వ్యవస్థలను పరిశీలించి మరింత మెరుగ్గా ఈ వ్యవస్థలను మార్చేందుకు అవసరమైన సలహాలు ఇస్తుంది.
» భూసంబంధిత అంశాల్లో అవసరమైనప్పుడు న్యాయసలహాలు అందజేస్తుంది.