సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక కుటుంబసభ్యులు బుధవారం మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లోని తన కార్యాలయంలో కలసిన ప్రవల్లిక కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రవల్లిక మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
తమ కుమార్తె మరణానికి కారణమైన శివరామ్ అనే వ్యక్తిని శిక్షించాలని ప్రవల్లిక కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రవల్లిక మరణం దురదృష్టకరమని, బాధాకర సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మంత్రి వారిని ఓదార్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర డీజీపీతో కేటీఆర్ మాట్లాడి, విచారణ వేగవంతం చేయాలని కోరారు.
ప్రవల్లిక మృతికి కారణమైన వ్యక్తికి తగిన శిక్ష పడేలా చూస్తామని ఆమె కుటుంబ సభ్యులకు హామీనిచ్చారు. అలాగే కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రవల్లిక సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని వారికి మంత్రి హామీ ఇచ్చారు. ‘ధైర్యంగా ఉండండి.. నీ బిడ్డను తెచ్చి ఇవ్వలేను కాని అన్ని విధాలుగా ఆదుకుంటా’అని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రవల్లిక తల్లిదండ్రులు లింగయ్య, విజయ తెలిపారు.
ADVERTISEMENT
ADVERTISEMENT