అమరావతి: ఎండలతో ఠారెక్కిపోతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వరుణుడు ఒక్కసారిగా ఉపశమనం కల్పించారు. ఎండలతో మండిపోతున్న వాతావరణం ఒక్కసారిగా వర్షం కురిసింది. విజయవాడలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి నీరు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు తెలంగాణలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపైకి నీరు చేరింది. అదేవిధంగా పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లో మోస్తారుగా వానలు కురిశాయి. ఎండల తీవ్రతతో తల్లడిల్లిపోయిన ప్రజలకు ఈ వర్షాలు కొంతమేర ఉపశమనం కల్పించాయి.
అయితే మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎండలు సైతం మండిపోయాయి. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో44.7 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 43.8, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 43.7, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 43.6, కృష్ణా జిల్లా కంకిపాడులో 43.4, ప్రకాశం జిల్లా కొండపిలో 43, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, నెల్లూరు జిల్లా గూడూరులో 44 డిగ్రీలు, కృష్ణా జిల్లా పెదపారుపూడి, పల్నాడు జిల్లా అమరావతిలో 43.4, కంచికచర్లలో 43.2, గుంటూరు జిల్లా రాయపూడిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
