సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు నగరాన్ని కమ్మేశాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్‌కు ఆరెంజ్ అలర్ట్.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. సిద్ధిపేట్, జగిత్యాల, భద్రాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది.
శంషాబాద్ అతలాకుతలం..
హైదరాబాద్‌లోని కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఇబ్రహీంపట్నం, ఆదిభట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం పడుతోంది. సదాశివపేటలో ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి శంషాబాద్ అతలాకుతలమైంది. శంషాబాద్ ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. బస్టాప్ సెల్లార్లోకి వరద నీరు చేరింది. శంషాబాద్‌లో భారీవర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
భారీ వర్షాలపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు చేశారు. హైదరాబాద్‌లో ఉన్నతాధికారులు హై అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డు, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను అలర్ట్‌గా ఉంచాలని సీఎం ఆదేశించారు.
సంగారెడ్డిలో ఈదురుగాలుల బీభత్సం
సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కొండాపూర్ మండలంలో గంటన్నర వ్యవధిలోనే 8.1 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. వర్షం ధాటికి జన జీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైంది. సదాశివపేట వద్ద రహదారిపై భారీ వృక్షం గాలికి విరిగిపడింది. సదాశివపేట చౌరస్తాలో బలమైన ఈదురుగాలులకు పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ షెడ్డు నేలకూలింది. అప్రమత్తమైన అధికారులు.. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు.
చౌటుప్పల్‌లో భారీ వర్షం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో ఈదరుగాలులతో భారీ వర్షం కురిసింది. వలిగొండ రోడ్డులో రహదారిపై భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

16 తేదీ నుంచి అధిక వర్షాపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. వరుసగా మూడు రోజులు తమ ప్రాంతంలో వర్షాలు కురిస్తేనే రైతులు విత్తనాలు వేసుకోవాలని ఆమె సూచించారు. హైదరాబాద్‌లో 17,18 తేదీలలో భారీ వర్ష సూచన ఉందని.. ఎల్నీలో ఎఫెక్ట్ ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఉంటుందన్నారు. ఎల్నీలో ప్రభావంతో చలికాలంలో ఎండలు ఎక్కువ ఉంటాయని.. ఎండాకాలం ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ నమోదు అవుతుందని తెలిపారు.
