సాక్షి, చెన్నై: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలోనూ ఓ మరణం కేసు నమోదైంది. మంగళవారం తూత్తుకుడిలో చికిత్స పొందుతున 52 ఏళ్ల వ్యక్తి మరణించాడు. వివరాలు.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా చెన్నై, శివారు జిల్లాలు, కోయంబత్తూరు, సేలంలో రోజు వారీ కేసుల సంఖ్య రెండంకెలుగా ఉన్నాయి. ఈ సమయంలో పొరుగున ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంపుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్లో కరోనాకు చికిత్స పొందుతూ వచ్చిన మహిళ ఒకరు సోమవారం మరణించారు.
దీంతో అక్కడ కరోనా ఆంక్షలను కఠినతరం చేశారు. ఈపరిస్థితులలో తూత్తుకుడిలో కరోనా మరణం సంభవించడం కలకలం రేపుతోంది. ఈ వ్యక్తి ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలోనే కరోనా బారిన పడడంతో పరిస్థితి విషమించి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.