న్యూఢిల్లీ/న్యూయార్క్/వాషింగ్టన్: రావణకాష్టంగా రగిలిపోతున్న, దశాబ్దాలుగా ఎటూ తేలకుండా సందిగ్ధత, సంఘర్షణలకు కారణమైన జమ్మూకశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి కనబరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆదివారం స్పందించింది. ‘‘కశ్మీర్‌పై మాకు స్పష్టమైన విధానం ఉంది. చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం గురించే. అంతకంటే మాట్లాడేది ఏదీ లేదు. ఉగ్రవాదుల అప్పగింత గురించి పాక్ మాట్లాడదల్చుకుంటే సిద్ధంగా ఉన్నాం. అంతకు మించి మాట్లాడటానికి మరో టాపికేమీ లేదు. ఇతర అంశాలపై ఇతరుల మధ్యవర్తిత్వం ఆశించట్లేము. ఇతరులు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు’’ అని ప్రకటించింది.
జేజేలు అంటూనే జోక్యానికి యత్నం
కాల్పుల విరమణకు ముందడుగు వేసి అత్యంత యుక్తితో వ్యవహరించిన శక్తివంతమైన భారత్, పాక్ అగ్రనాయకత్వాలను చూసి ఎంతో గరి్వస్తున్నానని ఓవైపు పొగుడుతూనే మరోవైపు కశ్మీర్ అంశంలో మధ్యవర్తిగా నిలబడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించుకోకపోతే వినాశనం తప్పదని భవిష్యత్ దర్శనం చేసి కాల్పుల విరమణకు మొగ్గుచూపిన భారత్, పాక్ నాయకత్వాలను చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. అయితే దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండి పోయిన కశ్మీర్ అంశానికి పరిష్కారం కనుగొనేందుకు మీ రెండు దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ జోక్యాన్ని స్వాగతించిన పాక్
మధ్యవర్తిగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ స్పందించింది. ‘‘ కాల్పుల విరమణ అంశంలో మధ్యవర్తిగా వ్యవహరించి నిర్మాణాత్మక పాత్ర పోషించినందుకు అమెరికాను అభినందిస్తున్నాం. ఇక జమ్మూకశ్మీర్ వివాద పరిష్కారానికి కృషిచేస్తానని ట్రంప్ ప్రకటన చేయడం ఎంతో సంతోషకరం. ఆయన సుముఖత వ్యక్తంచేయడాన్ని మేం అభినందిస్తున్నాం’’ అని పాకిస్తాన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.
కశ్మీర్ విషయంలో ట్రంప్ ఆఫర్‌ను తిరస్కరించిన భారత్
ADVERTISEMENT
ADVERTISEMENT