న్యూఢిల్లీ: దేశ చరిత్రలో 16వ జన గణన, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 8వ జన గణనకు రంగం సిద్ధమవుతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి జన గణన అధికారికంగా ప్రారంభం కానుంది. జనాభా లెక్కల సేకరణ వీలుగా పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా ప్రతిపాదించాలని కేంద్రం సూచించింది. జన గణన ప్రక్రియకు మార్పులు చేసిన పరిపాలనా యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. డిసెంబర్ 31న సరిహద్దులు ఖరారు చేస్తామన్నారు.
ఈ మేరకు రిజి్రస్టార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ నారాయణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, పట్టణాలను ఏకరూప ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించనున్నట్లు తెలిపారు. ఒక్కో బ్లాక్‌కు ఒక ఎన్యూమరేటన్ను నియమిస్తారు. జనాభా లెక్కల సేకరణలో పొరపాట్లు జరగకుండా వీరు చర్యలు తీసుకుంటారని వివరించారు. 3 నెలల్లోగా జన గణన పూర్తిచేయాల్సి ఉంటుంది.
2027 మార్చి 1వ తేదీ లోగా రెండు దశల్లో జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో హౌజ్‌లిస్టింగ్ ఆపరేషన్, రెండో దశలో పాపులేషన్ ఎన్యూమరేషన్ నిర్వహిస్తారు. హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ 2026 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి జన గణనతోపాటు కుల గణన కూడా చేపట్టనున్నారు. ఎన్యూమరేషన్ బ్లాక్‌లు ఖరారైన తర్వాత పరిపాలనా యూనిట్ల సరిహద్దుల్లో మార్పులు చేయడానికి వీలుండదు. దేశంలో చివరిసారిగా 2011లో జన గణన జరిగింది. మళ్లీ 16 ఏళ్ల తర్వాత.. 2027లో జరగబోతోంది.