సాక్షి, హైదరాబాద్: దేశంలో గత కొన్ని నెలలుగా పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం నడుస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యత వహించి రాజీనామా చేయమని కోరితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయట్లేదన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న నిరసన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
గతంలో రైల్ యాక్సిడెంట్ అయితే రైల్వేశాఖ మంత్రైన లాల్ బహుదూర్ శాస్త్రి రాజీనామా చేశారని మరి అలాంటప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారం నడుస్తున్నప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయట్లేదని ప్రశ్నించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసన కొనసాగుతుంది. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ స్పోక్ పర్సన్ విజేత దాయ్ అతిథిగా హాజరయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు ( ఆదివారం) హైదరాబాద్లో ఆందోళనకు పిలుపునిచ్చింది.
నీట్, సీబీఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుంది. ఇటీవలే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ మాస్కులు ధరించి, చేతుల్లో పుస్తకాలు, జాతీయ జెండాలతో యువత భారీ ఎత్తున నిరసన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పుణేలోని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ క్యాంపస్లో వేలాది మంది విద్యార్థులు, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ మద్దతుతో భారీ నిరసన ప్రదర్శన చేశారు.
ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చిన విషయం తెలిసిందే. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతుంది.